Jammu And Kashmir: ఎస్సై పోస్టుకు ఎంపికయ్యాడు.. అంతలోనే ఉగ్రవాదుల్లో చేరి ఎన్ కౌంటర్ అయ్యాడు.. ఇంజినీరింగ్ పట్టభద్రుడి విషాదగాథ!

  • నాలుగు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సిన వాడు
  • ఉగ్రవాదుల్లో చేరిన 48 గంటల్లోనే హతం
  • జమ్ముకశ్మీర్‌లో ఘటన
అతడు ఇంజినీరింగ్ పట్టభద్రుడు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతడి పేరు షార్ట్ లిస్ట్ అయింది. మరో నాలుగు రోజుల్లో ఉద్యోగంలో చేరబోతున్నాడు. అంతలోనే ఉగ్రవాదిగా మారి పోలీసుల చేతిలో హతమయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిందీ ఘటన.

జమ్ముకశ్మీర్ పోలీసులు మంగళవారం పోలీసు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 2,060 మంది అభ్యర్థులు ఎంపికవగా, అందులో ఖుర్షీద్ అహ్మద్ మాలిక్ ఒకడు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అరాబల్ గ్రామానికి చెందిన ఖుర్షీద్ బీటెక్ చదువుకున్నాడు. పోలీసు ఉద్యోగాల కోసం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన రాత పరీక్షకు హాజరయ్యాడు. ఎస్సై పోస్టుకు ఎంపికైన ఖుర్షీద్‌ను ఫైనల్ ఇంటర్వ్యూకు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఆగస్టు 3న బారాముల్లాలోని సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఖుర్షీద్ హతమయ్యాడు. ఉగ్రవాదుల్లో మిలిటెంట్ ర్యాంకులో చేరిన సరిగ్గా 48 గంటల తర్వాత ఖుర్షీద్‌ను పోలీసులు మట్టుబెట్టారు.

ఇటీవలే బీటెక్ పూర్తిచేసిన ఖుర్షీద్ ‘గేట్‌’లోనూ ఉత్తీర్ణత సాధించాడు. కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్) పరీక్షలకు సిద్ధమవుతున్న అతడు కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేసేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఉగ్రవాదుల్లో చేరి భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు.
Jammu And Kashmir
Encounter
Police
Terrorist

More Telugu News