gvl: పీడీ అకౌంట్లపై జీవీఎల్ కు కనీస అవగాహన లేదు.. వస్తే కనుక ట్యూషన్ చెబుతా!: కుటుంబరావు

  • పబ్లిక్ ఫైనాన్స్ పైనా జీవీఎల్ కు కనీస అవగాహన లేదు
  • తెలియకపోతే నోరుమూసుకుని ఉండాలి
  • ఏపీ విషయంలో బీజేపీ ఉగ్రవాదిలా వ్యవహరిస్తోంది

బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్ అంటే.. ‘గ్లోబస్ వైరల్ లయర్’ అని ఎద్దేవా చేశారు. పీడీ అకౌంట్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలియని జీవీఎల్.. పీడీ అకౌంట్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లోఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ, ఇన్‌కమ్ టాక్స్ అధికారులు రైడ్ చేసి సీజ్ చేసిన మొత్తాన్ని పీడీ అకౌంట్లో పెడతారని, కోర్టుల ఖాతాలు కూడా పీడీ అకౌంట్ రూపంలోనే ఉంటాయని అన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కూడా తప్పు పడుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.

‘ఏ కార్పొరేషన్‌కు అయినా పోదాం.. ఏ సీఏజీని అయినా తీసుకురండి.. లెక్కలు తేల్చుకునేందుకు సిద్ధం.. మీరు సిద్ధమా? మీరు మా లెక్కల్లో తప్పులు నిరూపిస్తే.. మేమే మాపై విచారణ చేయించుకుని జైలుకు పోతాం. రాఫెల్‌ ఒప్పందంలో రూ.30 వేల కోట్లు తినేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మీరు దమ్ముంటే రాఫెల్ మీద ఎంక్వైరీ వేసుకుని మీ నిజాయతీ నిరూపించుకోగలరా?’ అని జీవీఎల్‌కు కుటుంబరావు సవాల్ విసిరారు. ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జరిగి.. ఆ రైడ్‌లో రూ. 100 కోట్లు సీజ్ చేస్తే... రూ.50 కోట్లు బీజేపీకి ఫండ్ రూపంలో పోతోందన్న ప్రచారం జరుగుతోందని, గత రెండు రోజులుగా జీవీఎల్ ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారని, 53,539 ఖాతాలలో 19,320 ఖాతాలు ఆపరేట్ చేయలేదని వారే చెప్పారని కుటుంబరావు పేర్కొన్నారు.

ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ ఖాతాకు మళ్లినట్టు నిరూపిస్తే అరెస్ట్ కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దుష్ప్రచారం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటున్నామని అన్నారు. ఎస్సార్ ఆయిల్ గురించి జీవీఎల్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జీవీఎల్ యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఆ రాష్ట్రంలో లక్షా 54 వేల కోట్లకు యూసీలు ఇవ్వలేదని కుటుంబరావు వివరించారు. వాటి గురించి జీవీఎల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉండేందుకే జీవీఎల్ గోబెల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీ నేతలు అన్నట్లుగానే, ఏపీలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, ఏపీపై దండయాత్ర చేస్తామని, చుక్కలు చూపిస్తామని అప్పట్లో బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారని, దీనికి తగ్గట్లుగానే ఏపీపై అబద్ధాలు, అసత్య ఆరోపణలతో జీవీఎల్ దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు.

ఏపీ విషయంలో బీజేపీ ఉగ్రవాదిలా వ్యవహరిస్తోందని, ప్రస్తుతం ఏపీలో 24 వేల పీడీ ఖాతాలు మాత్రమే ఉన్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. పబ్లిక్ ఫైనాన్స్, పీడీ ఖాతాలపై జీవీఎల్ కు కనీస అవగాహన లేదని, ఈ అంశాలపై ఆయనకు ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ విషయం గురించి అయినా తెలిస్తే మాట్లాడాలని, తెలియకపోతే నోరుమూసుకుని ఉండాలని, తెలియని విషయాలు తెలుసుకుని మాట్లాడడం తప్పుకాదని అన్నారు. జీవీఎల్ కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని, పదే పదే చెబితే, అబద్ధాలు నిజాలు అయిపోతాయనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారని కుటుంబరావు మండిపడ్డారు.

More Telugu News