svu medical college: డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసులో ఎస్వీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ సస్పెన్షన్!

  • ఈ మేరకు డీఎంఈ ఆదేశాలు
  • మరో ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్న జూడాలు
  • వారిపైనా చర్యలు తీసుకోవాలని జూడాల డిమాండ్

డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసులో ఎస్వీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ రవికుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ రవికుమార్ వేధింపుల వల్లే శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే, డీఎంఈ ఆదేశాలపై జూనియర్ డాక్టర్లు శాంతించడం లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఇద్దర్నీ వదిలేసి, ఒక్క రవికుమార్ నే సస్పెండ్ చేయడమేంటని జూనియర్ డాక్టర్లు (జూడాలు) ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టరు కిరీటీ, డాక్టరు శివకుమార్ లపైనా చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ప్రొఫెసర్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయమై విచారణకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన నివేదక ఇంతవరకూ బయటపెట్టలేదు. మరోపక్క, నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిలైంది. దీంతో ఆవేదన చెందిన శిల్ప, తనపై ముగ్గురు ప్రొఫెసర్లు కక్ష గట్టడం వల్లే తాను ఫెయిలయ్యానని తన స్నేహితులు, సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున శిల్ప ఆత్మహత్య చేసుకుంది.

More Telugu News