CM Ramesh: గతంలో ఎవరికీ రానంత మెజార్టీ సాధించిన సీఎం రమేష్.. వైసీపీ ఓట్లు కూడా ఆయనకే!

  • పీఏసీ సభ్యుల ఎన్నికల్లో రమేష్ కు 106 ఓట్లు 
  • గతంలో ఎవరూ ఇన్ని ఓట్లను సాధించలేదు
  • బీజేపీని కాదని.. రమేష్ కు ఓటు వేసిన అన్నాడీఎంకే

పార్లమెంటులో అత్యంత కీలకమైన ప్రజా పద్దుల కమిటీ సభ్యుల ఎన్నికల్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఘన విజయం సాధించారు. రాజ్యసభలో టీడీపీకి కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ... విపక్ష సభ్యుల అండతో రమేష్ ఏకంగా 106 ఓట్లను సాధించారు. గతంలో ఎవరికీ దక్కనన్ని ఓట్లు రమేష్ కు దక్కాయి. టీడీపీకి బద్ధ శత్రువైన వైసీపీ కూడా రమేష్ కే ఓటేసింది. అలాగే టీఆర్ఎస్ కూడా రమేష్ కే ఓటు వేయడం గమనార్హం. వీటితో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేడీ సభ్యులు కూడా రమేష్ కు అండగా నిలబడ్డారు. నిన్న మధ్యాహ్నం రెండు సీట్లకు ఎన్నికలు జరగ్గా సీఎం రమేష్ గెలుపొందారు.

ఈ ఎన్నికలో బీజేపీకి షాక్ తగిలింది. మోదీ, అమిత్ షాలకు కుడి భుజమైన భూపేంద్ర యాదవ్ కు బీజేపీ ఓట్లు మినహా వేరే ఓట్లు పడలేదు. బీజేపీ సభ్యులంతా ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరు కావాలని అమిత్ షా కోరినప్పటికీ... నలుగురు సభ్యులు గైర్హాజరైనట్టు సమాచారం. చివరకు భూపేంద్ర యాదవ్ కు కేవలం 69 ఓట్లు మాత్రమే లభించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన హరివంశ్ నారాయణ్ సింగ్ 26 ఓట్లతో ఘోర పరాజయం పొందారు.

మరోవైపు, పోటీ నుంచి సీఎం రమేష్ ను విరమింపజేసేందుకు బీజేపీ నేతలు విశ్వయత్నం చేశారు. ఇప్పటికే పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నందున... పీఏసీ సభ్యుడిగా పోటీ చేయవద్దంటూ సూచించారు. అయినా పట్టు వదలని రమేష్... విపక్షసభ్యల మద్దతును కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు. విపక్షసభ్యుల ఓట్లను సంపాదించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రమేష్ కు మద్దతుగా ఓటు వేశారు.

మరోవైపు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. విశ్వాస పరీక్షలో మోదీకి అండగా నిలిచిన అన్నాడీఎంకే... ఈ ఎన్నికలో రమేష్ కు అనుకూలంగా ఓటు వేసింది. ఆ పార్టీకి చెందిన 13 మంది సభ్యులు రమేష్ కే ఓటు వేశారు.

More Telugu News