Chandrababu: ఏపీలో చేనేతను ధ్వంసం చేశారు: చంద్రబాబుపై కాంగ్రెస్ నేత ఫైర్

  • ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు
  • అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదు
  • చేనేతను మరింత అధ్వాన పరిస్థితికి తీసుకొచ్చారు

ఏపీలో చేనేత కార్మికులను ఉద్ధరిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాల జల్లు కురిపించిన చంద్రబాబునాయుడు అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కటీ అమలు చేయలేదు సరిగదా చేనేతను మరింత అధ్వాన పరిస్థితికి తీసుకురావడం బాధాకరమని ఏపీసీసీ అధికారప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ విమర్శించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పిన వారు, గడచిన ఐదు బడ్జెట్లలో కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదని, అందులోనూ రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మగ్గాలు ఉండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరిలో నూటికి 5 శాతం మందికి కూడా పని దొరక్క లక్షల మంది కార్మికులు మగ్గాలను మూలనపడేసి ఇతర ప్రాంతాలకు, ఇతర పనులకు వలసపోతున్నా, అర్ధాకలితో అలమటిస్తున్నా, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
 
కేంద్రంలోని మోదీ సర్కారు చేనేత కార్మికులకు ఉన్న ఆరోగ్య బీమా కార్డులు రద్దు చేయడం వల్ల రాష్ట్రం లోని చేనేత కార్మికులు ఉచిత వైద్యం అందడం లేదని, బీమా పథకంలో చేరిన సభ్యుని ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు సంవత్సరానికి రూ.1200 ఉపకారం వేతనం ఇచ్చేవారని, మోదీ ప్రభుత్వం ఈ స్కీమును సైతం రద్దు చేసిందని అన్నారు. చేనేతలకు రిజర్వు చేసిన 11 రకాల వస్త్రాలను నిబంధనలను ఉల్లంఘించి పవర్‌లూమ్‌ మగ్గాలపై తయారు చేస్తున్నారని, దీంతో మార్కెట్‌లో చౌకగా లభ్యమవుతున్న పవర్‌లూమ్‌ వస్త్రంతో చేనేత వస్త్రం పోటీ పడలేకపోతోందని అన్నారు.

దీనికి తోడు జీఎస్టీ విధించడంతో చేనేత వస్త్రాల ధర మరింత పెరిగి సామాన్య జనానికి అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. చేనేత సహకార రంగంలో తయారైన వస్త్రాలను మార్కెట్‌ చేయడానికి ప్రారంభించిన ఆప్కో అవకతవకలకు నిలయంగా మారిందని, ఆప్కో పవర్‌లూమ్‌ యజమానుల నుండి వస్త్రాలు కొని తామే చేనేత సొసైటీలలో తయారు చేయించినట్లు స్కూల్‌ పిల్లలకు ఇస్తున్నారని, చేనేత వస్త్రం ధర మీటరు రూ.80 ఉంటే, పవర్‌లూమ్‌ వస్త్రం రూ.35 మాత్రమే ఉంటుందని అన్నారు.

రికార్డులలో చేనేత వస్త్రం కిందనే చూపి పవర్‌లూమ్‌ వస్త్రాలను అందజేస్తున్నారని, ఈ విధంగా ఆప్కో పాలకవర్గం, అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పట్టు చీరల తయారీ లోకి పవర్‌లూమ్‌ల రాకతో నాలుగేళ్ల కాలంలో ఒక్క అనంతపురం జిల్లాలో 70 వేల మగ్గాలు మూలన పడ్డాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో వ్యవహరించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. భవిష్యత్తులో సైతం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచిన చేనేతను బతికించుకునేందుకు ఈ కింది విధంగా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.

- చేనేత కార్మికులకు పూర్తి రుణాలు మాఫీ చేసి, కనీస వేతనాన్ని రెట్టింపు చేయాలి

- తిరుమల తిరుపతి దేవస్థానం, వైద్య, రవాణా, పోలీసు వంటి సుమారు 98 ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాల తయారీని ఆప్కో ద్వారా చేనేత సొసైటీలకు అప్పగించాలి

- రాజీవ్‌ విద్యా మిషన్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు చేనేత వస్త్రాలను ఉచితంగా ఇవ్వాలి

- చేనేత కార్మికుల సంక్షేమానికి తక్షణమే ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కనీస ఆదాయం కల్పించాలి, పింఛన్లు మంజూరు చేయాలి, ఉచిత వైద్యం అందించాలి. కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్య, ఉపకార వేతనాలు అందించాలి 

  • Loading...

More Telugu News