Yadadri Bhuvanagiri District: వ్యభిచారం మానేస్తామంటే సన్మానం చేసి సరిపెట్టిన పోలీసులు... దారిలేక తిరిగి అదే వృత్తిలో కొనసాగుతున్న వైనం!

  • 2016లో ఫలించిన అధికారుల ప్రయత్నం
  • ప్రత్యామ్నాయాలు చూపిస్తామని హామీ ఇచ్చిన సర్కారు
  • పట్టించుకోక పోవడంతో మరో దారి కనిపించలేదంటున్న సెక్స్ వర్కర్లు

తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపిస్తే, సమాజంలో గౌరవంగా బతుకుతామని, వ్యభిచారాన్ని మానేస్తామని చెప్పిన సెక్స్ వర్కర్లకు కేవలం సన్మానాలు చేసి సరిపెట్టిన పోలీసులు, ఆపై వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2016లో యాదగిరిగుట్టలో అధికారులు చేసిన ప్రయత్నాలతో పడుపు వృత్తిని వదిలేస్తామని చెబుతూ ముందుకు వచ్చిన మహిళలను అభినందించిన పోలీసులు, వారికి ఎటువంటి సహాయం కావాలన్న విషయమై నివేదికలు కూడా తయారు చేశారు.

తమకు ఇళ్లు కావాలని, ఉపాధిని చూపాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం, సబ్సిడీపై రుణాలు, తమ పిల్లలకు ఉచిత చదువులు, ఉపకార వేతనాలు తదితరాలను వారు కోరారు. తమను ఎస్టీల్లో చేర్చాలని కూడా అడిగారు. తమ ఇళ్లలోని పురుషులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇది జరిగి రెండు సంవత్సరాలు కాగా, ఏదో తూతూమంత్రంగా అతికొద్ది మందిని ఆదుకున్న సర్కారు, ఆపై పట్టించుకోలేదు. దీంతోనే వ్యభిచారం మానేస్తామని ముందుకు వచ్చిన తాము, మరో దారి కనిపించక తిరిగి అదే వృత్తిలో కొనసాగక తప్పలేదంటున్నారు సెక్స్ వర్కర్లు.

More Telugu News