Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించిన ఏపీ ఎస్పీఎఫ్ జవాన్లు!

  • వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగింపు
  • ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి కోరిన జవాన్లు
  • నిరాకరించడంతో అక్కడే బైఠాయింపు

గత నాలుగేళ్లలో వివిధ కారణాలతో విధుల నుంచి తొలగింపునకు గురైన 85 మంది ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్పీఎఫ్‌) జవాన్లు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. చిన్నచిన్న పొరపాట్లకు తమను ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నుంచి తప్పించడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చిన వీరంతా సీఎంను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని సీఎం భద్రతా సిబ్బంది వారికి తేల్చి చెప్పారు. దీనికి నిరాకరించిన వారంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఒకరిద్దరు మనస్తాపంతో ఆత్మహత్య కూడా చేసుకున్నారన్నారు. కొందరికైతే ఇంకా 20 ఏళ్ల సర్వీసు ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సీఎం నివాసం ఎదుట బైఠాయించిన ఏపీఎస్పీఎఫ్ జవాన్లను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

  • Loading...

More Telugu News