Congress: ఎంగిలి మెతుకులు విదిల్చిన‌ట్లు నిధులు విడుద‌ల చేశారు: కేంద్రంపై తుల‌సిరెడ్డి మండిపాటు

  • ఇవ్వాల్సింది కొండంత - ఇచ్చింది గోరంత‌
  • మోది మోసం, చంద్ర‌బాబు చేత‌గానిత‌నం, జ‌గ‌న్ అవ‌కాశ‌వాదం  
  • 2019లో అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక‌హోదాతో పాటు అన్ని అంశాలు అమ‌లు చేస్తాం

కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇవ్వాల్సింది కొండంత అయితే, ఇచ్చింది మాత్రం గోరంత అని ఏపీసీసీ ఉపాధ్య‌క్షుడు ఎన్‌.తుల‌సిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన జ‌గ‌న్ పార్టీ కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైద‌రాబాద్ రాజ‌ధాని న‌గ‌రం తెలంగాణ‌కు ద‌క్కినందున ఆ మేర‌కు సీమాంధ్ర‌కు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం అనేక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించిందని, అవి అమ‌లై ఉంటే సీమాంధ్ర స్వ‌ర్ణాంధ్ర అయ్యి ఉండేదని తెలిపారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఉంటే ఈ పాటికి అన్నీ అమ‌లై ఉండేవి కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీయే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో అవి అమ‌లుకు నోచుకోలేదని విమర్శించారు. నరేంద్ర మోది మోస‌గారి త‌నం, చంద్ర‌బాబు చేత‌గాని త‌నం, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అవ‌కాశ‌వాదం వ‌ల్ల కొన్ని అమ‌లుకు అస‌లు నోచుకోలేదని, కొన్నింటికి మాత్రం పిల్లికి భిక్షం వేసిన‌ట్లు, మ‌రికొన్నింటిలో ఎంగిలి మెతుకులు విదిల్చిన‌ట్లు నిధులు విడుద‌ల చేయ‌డం జ‌రిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో కాంగ్రెస్ ని గెలిపించాలని, అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక‌హోదా అమ‌లుతో పాటు చ‌ట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు త్వ‌రిత‌గ‌తిన అమ‌లు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తుల‌సిరెడ్డి తెలిపారు.

More Telugu News