heena gavit: బీజేపీ ఎంపీ హీనా కారును ధ్వంసం చేసిన మరాఠాలు.. ఘటన సమయంలో కారులోనే ఎంపీ!

  • మరాఠాల నిరసనలతో అట్టుడుకుతున్న మహారాష్ట్ర
  • ధూలేలో హీనా గవిట్ కారుపై దాడి
  • 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠాలు చేస్తున్న ఆందోళనలు, బంద్ లు, రాస్తారోకోలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇందులో భాగంగా ధూలేలో ఈ రోజు బీజేపీ ఎంపీ హీనా గవిట్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హీనా కారు వెలుపలికి వచ్చిన వెంటనే నిరసనకారులు దాడికి తెగబడ్డారు. ఆమె కారు అద్దాలను పగులగొట్టారు. దాడి జరిగిన సమయంలో హీనా కారులోనే ఉన్నారు. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారని జిల్లా ఎస్పీ రామ్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి 16 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందుర్బార్ నియోజకవర్గం నుంచి హీనా లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీ కోటా కింద 16 శాతం రిజర్వేషన్లను కల్పించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News