kiki challenge: 'కికీ' చాలెంజ్ కు దేశీ టచ్.. ఇంటర్నెట్ లో అదరగొడుతున్న వీడియో!

  • దుమ్ములేపిన తెలంగాణ యువ రైతులు
  • ఇంటర్నెట్ లో కోటిన్నర వ్యూస్
  • పలువురు సెలబ్రిటీల అభినందన

కికీ చాలెంజ్.. ఇప్పుడు చిన్నాపెద్ద, దేశం, ప్రాంతం తేడా లేకుండా అందర్నీ ఊపేస్తోంది. నడుస్తున్న కారు నుంచి రోడ్డుపై దిగి డ్యాన్స్ చేయడాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నా, ఇది ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలో ఇద్దరు యువ రైతులు కికీ చాలెంజ్ డ్యాన్స్ చేశారు. ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారినా పోలీసుల నుంచి ఎలాంటి వార్నింగులు రాలేదు. ఎందుకంటే వీరిద్దరూ కికీ చాలెంజ్ చేసింది పొలంలో కాబట్టి.

తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనీల్ కుమార్(24), పిల్లి తిరుపతి(28) వరినాట్ల సందర్భంగా ఎద్దులతో  పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ పాడిన ‘ఇట్స్ మై ఫీలింగ్స్’ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. కొంచెం గంగ్నమ్ స్టైల్, మరికొంచెం దేశీ డ్యాన్స్ మిక్స్ చేసి అదరగొట్టేశారు. అసలే అద్భుతమైన పాట.. దానికి దేశీ టచ్.. ఇంకేముంది? ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సినిమా దర్శకుడు శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్ లో ఈ నెల 1న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.6 కోట్ల మంది చూశారు.

ఈ వీడియో వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. ప్రముఖ కెనడియన్ కమెడియన్, టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోవా.. కికీ చాలెంజ్ లో ఈ ఇద్దరు యువ రైతులు విజేతలుగా నిలిచినట్లు ప్రకటించాడు. ‘రక్త చరిత్ర’ ఫేమ్ వివేక్ ఒబెరాయ్ కూడా ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, తనకు ఇంతపేరు తీసుకొచ్చిన ‘కికీ చాలెంజ్’ లోని కికీ పదాన్ని తిరుపతి తన కుమారుడికి పెట్టుకున్నాడు. పేరు తెచ్చిన కికీ చాలెంజ్ రుణాన్ని ఇలా తీర్చుకున్నాడన్నమాట.

More Telugu News