Venezuela: డ్రోన్లకు బాంబు పెట్టి చంపాలనుకున్నారు.. వెనిజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం!

  • మదురో లక్ష్యంగా డ్రోన్ల దాడి
  • తృటిలో తప్పించుకున్న సోషలిస్ట్ నేత
  • కొలంబియానే దాడి చేయించిందని ఆరోపణ

వెనిజులా అధ్యక్షుడు, సోషలిస్ట్ నేత నికోలస్ మదురోపై హత్యాయత్నం జరిగింది. రెండు డ్రోన్లకు పేలుడు పదార్థాలను అమర్చిన దుండగులు మదురో సమీపంలోకి తీసుకెళ్లి పేల్చేశారు. ఈ ఘటనలో మదురో సురక్షితంగా బయటపడ్డారు. 

రాజధాని కారకస్ లో శనివారం జరిగిన వెనిజులా నేషనల్ ఆర్మీ 81వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మదురో మాట్లాడుతుండగా ఈ దాడి చోటుచేసుకుంది. సాయంత్రం 5.41 గంటలకు మదురో ప్రసంగిస్తుండగా.. ఓ డ్రోన్ సభావేదిక సమీపంలోకి వచ్చి పేలిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు మరో డ్రోన్ ను దుండగులు పేల్చేశారు. దీంతో మదురో బాడీగార్డులు ఆయన చుట్టూ రక్ష కవచంగా ఏర్పడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పేలుడుతో సైనికులు తలోదిక్కు పరిగెత్తారు.

కొలంబియా అధ్యక్షుడు శాంటోస్ ఈ దాడి చేయించారని మదురో ఆరోపించారు. శాంటోస్ అమెరికాతో చేతులు కలిపి కొలంబియాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణల్ని శాంటోస్ ఖండించారు. కాగా, ఈ డ్రోన్లు పేలిపోవడంతో ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో మదురో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News