Madhya Pradesh: అమెరికాలో కంటే మా రాష్ట్రంలోని రోడ్లే బాగుంటాయ్: మళ్లీ చెప్పిన శివరాజ్ సింగ్ చౌహాన్

  • అమెరికా రోడ్ల కంటే ముమ్మాటికి మధ్యప్రదేశ్ రోడ్లే బెటరన్న సీఎం
  • అమెరికన్లకు కూడా ఆ మాట చెప్పానన్న చౌహాన్
  • గతంలో ఆ మాటన్నందుకు ట్రోల్ చేసిన నెటిజన్లు

అమెరికాలో కంటే తమ రాష్ట్రంలోని రోడ్లే చాలా బాగుంటాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. నాణ్యమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు ప్రజలకు అందుతోందని పేర్కొన్నారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా షాదోల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అమెరికా వెళ్లినప్పుడు అక్కడి రోడ్లను చూసి ఆశ్చర్యపోయానని, మీ రోడ్ల కంటే మా రోడ్లు ఎంతో బాగుంటాయని వారికి  చెప్పానని గుర్తు చేశారు. ఇలా చెప్పినందుకు కాంగ్రెస్ తనను విమర్శించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ మళ్లీ అదే విషయాన్ని చెబుతున్నానని, అమెరికా రోడ్లకు మన రోడ్లు ఏమాత్రం తీసిపోవని పునరుద్ఘాటించారు.

 మధ్యప్రదేశ్‌లోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే బాగున్నాయన్న సీఎం వ్యాఖ్యలు గతేడాది అక్టోబరులో ట్రోల్ అయ్యాయి. అమెరికా రోడ్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చౌహాన్‌ను ట్రోల్ చేశారు. తాజా ర్యాలీలో చౌహాన్ మరోమారు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా అమెరికా కంటే మధ్యప్రదేశ్ రోడ్లే బాగుంటాయని పునరుద్ఘాటించారు. 

More Telugu News