Tamil Nadu: ఇంటి పనిమనుషులకు గంటకు రూ.37 కంటే తక్కువ ఇస్తే ఏడేళ్ల జైలు.. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం!

  • ఇంటి పని మనుషులకు వేతనం నిర్ణయించిన ప్రభుత్వం
  • నెలకు రూ. 6,836గా నిర్ణయం
  • హోం నర్సులకు రూ.8,051 వేతనం
  • యజమానులు ఉల్లంఘిస్తే జైలుకే

అసంఘటిత రంగ కార్మికుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంస్కరణలకు తెరలేపింది. వారి పక్షాన నిలుస్తూ సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటి పనిమనుషులకు వేతనం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిబంధనలు విధించింది. ఇంటి పనులు చేసే వారికి గంటకు రూ.37 కంటే తక్కువ ఇవ్వరాదని అందులో పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని హెచ్చరించింది.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నైపుణ్యం లేని (అన్‌ స్కిల్డ్) ఇంటి పని మనుషులకు గంటకు రూ.37 చొప్పున చెల్లించాలి.  నైఫుణ్యం కలిగిన వారికి గంటకు రూ.39, పాక్షిక నైపుణ్యం కలిగిన వారికి గంటకు రూ.38 చొప్పున చెల్లించాలి. రోజుకు 8 గంటల పనివేళలకు గాను ఈ వేతనాన్ని నిర్ణయించారు. ఇందులో ఇల్లు ఊడ్చడం, ఫ్లోరు, పాత్రలు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, పిల్లలను చూసుకోవడం వంటి పనులు ఉన్నాయి.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఇంటి పనిమనిషికి నెలకు రూ.6,836, హోం నర్సులు వంటి వారికి నెలకు రూ.8,051 వేతనం చెల్లించాలి. ఇక ఇంటి పట్టునే ఉంటే అన్ని పనులు చేసుకునే వారి విషయంలోనూ మరికొన్ని నిబంధనలు విధించింది. పైన నిర్దేశించిన వేతనానికి అదనంగా 10 శాతం వారికి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, నివాస వసతి, దుస్తులు, ఆహారం వంటి వాటిని కూడా యజమానులే భరించాలి.

ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి పనులు చేయించుకునే వారిపై కనీస వేతన చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు. నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడడం ఖాయం.

More Telugu News