topudurthi: పేరూరు డ్యామ్ కు నీటి తరలింపు చంద్రబాబు ఎన్నికల స్టంట్: రాప్తాడు వైసీపీ నేత తోపుదుర్తి

  • వైయస్ కృషి వల్లే జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయి
  • హంద్రీనీవా ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్చి చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు
  • కాపు రిజర్వేషన్లను ఎందుకు సాధించలేకపోయారు?

అనంతపురం జిల్లా పేరూరులో ఉన్న పేరూరు డ్యామ్ కు నీటిని తీసుకొచ్చే కాల్వల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 804 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కాల్వకు పరిటాల రవి పేరు పెడతామని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ కృషి వల్లే జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని ఆయన చెప్పారు.

గత ఆరేళ్లుగా హంద్రీనీవా జలాలు వస్తున్నప్పటికీ... ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వలేదని తోపుదుర్తి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తేనే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో నాలుగేళ్ల పాటు స్నేహం చేసిన చంద్రబాబు... కాపు రిజర్వేషన్లను ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్ కటాఫ్ ను ఎత్తివేసేందుకు అన్ని పార్టీల మద్దతుతో ముద్రగడ పద్మనాభం పోరాడాలని సూచించారు. 

More Telugu News