India: నెరవేరనున్న కల... సిద్ధిపేటలో కేంద్రీయ విద్యాలయానికి మోదీ సర్కారు ఆమోదం!

  • 7 రాష్ట్రాల్లో 13 కేంద్రీయ విద్యాలయాలు
  • ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం
  • ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే ఆరు కేవీలు

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపగా, ఆ జాబితాలో తెలంగాణలోని సిద్ధిపేట కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో మెదక్, సిద్ధిపేట జిల్లా వాసుల నాణ్యమైన విద్యా కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.

ఈ 13 స్కూళ్లు యూపీలోని బందా, మీర్జాపూర్, భదోహి, సీఐఎస్ఎఫ్ సూరజ్ పూర్, బవోలీ, మహారాష్ట్రలోని వాసిమ్, మణిపూర్ లోని చక్పికారాంగ్, మహారాష్ట్రలోని పర్బని, బీహార్ లోని నవాడా, దేవ్ కుండ్, జార్ఖండ్ లోని పలమావు, తెలంగాణలోని సిద్ధిపేట, కర్ణాటకలోని కుదంలకుంటే ప్రాంతాల్లో ఏర్పాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఇదే సమయంలో మధ్య ప్రదేశ్ లోని రాట్లాం ప్రాంతంలో అదనపు జవహర్ నవోదయా విద్యాలయను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

 ప్రస్తుతం దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యను 12 లక్షల మందికి అందిస్తుండగా, జవహర్ నవోదయా విద్యాలయాల్లో 2.50 లక్షల మంది చదువుకుంటున్నారు. కేంద్రీయ విద్యాలయాల నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి భూమి, వసతి ఏర్పాటు చేయాల్సి వుందని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News