Telugudesam: ఏపీలో నిరుద్యోగ భృతి .. నేడు ఆమోదం తెలపనున్న చంద్రబాబు సర్కారు!

  • టీడీపీ మేనిఫెస్టోలో కీలకహామీగా నిరుద్యోగ భృతి
  • విధివిధానాలను నేడు ఆమోదించనున్న ఏపీ ప్రభుత్వం
  • పలు అంశాలపైనా మంత్రులతో చర్చించనున్న చంద్రబాబు

2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై మార్గదర్శకాలకు నేడు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ ఉదయం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభంకాగా, పలు కీలకాంశాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి. నిరుద్యోగ భృతి విధివిధానాలను ఇప్పటికే ప్రతిపాదించిన ప్రభుత్వం, దానికి ఆమోదం పలకనుంది. భృతి పొందేందుకు ఎవరు అర్హులు? వారిలో నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగావకాశాలు కల్పించడం ఎలా? విద్యార్హతలు ఏంటి? తదితరాలపై మంత్రి మండలి నిర్ణయాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి.

ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా బిల్లు,  పర్యాటక ప్రాజెక్టులను భూమి కేటాయింపు, పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కేటాయింపు తదితర అంశాలపైనా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ప్రధాన విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖకు రైల్వే జోన్ వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లపై స్పందించాల్సిన తీరుపైనా చంద్రబాబు చర్చించనున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశంపైనా చర్చ జరుగుతుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరో ఏడాదిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ భేటీ కీలకం కానుంది.

More Telugu News