East Godavari District: నాలుగు వారాలుగా కదలని 'దుర్గాడ పాము'... ఇప్పుడు యాక్టివ్ అయింది!

  • గత 26 రోజులుగా ఒకే చోట పాము
  • నిన్న కుబుసం విడవడంతో చరుకుగా కదలికలు
  • భక్తులను ఏమీ చేయని సర్పం

తూర్పు గోదావరి జిల్లా దుర్గాడ శివార్లలో సుమారు నాలుగు వారాలుగా ఎటూ కదలకుండా ఉండి, ప్రజల పూజలు అందుకుంటున్న పాము, ఇప్పుడు యాక్టివ్ అయింది. సుమారు రెండేళ్ల వయసున్న పాము నిన్న కుబుసం విడిచింది. కుబుసం విడవక ముందు ఆహారం తీసుకోకుండా, నీరసంగా ఉన్న పాము, ఇప్పుడు చురుకుగా అటూ ఇటూ కదులుతోంది. అయినప్పటికీ, ప్రజలు భయపడకుండా తమ వద్దకు వస్తున్న పాముకు దండాలు పెడుతూ పూజలు చేస్తున్నారు. ఆ పాము కూడా ఇంతవరకూ ఎవరినీ కాటు వేయలేదు.

మరోవైపు పాము ఉన్న ప్రాంతానికి ఓ అంబులెన్స్, యాంటీ వీనమ్ స్క్వాడ్ చేరుకుంది. పాము సమీపానికి వెళ్లవద్దని అధికారులు చెబుతున్నా ప్రజలు వినిపించుకునే పరిస్థితిలో లేరు. పాము తమను ఏమీ చేయకపోతుండటంతో అది దేవుని మహిమేనని చెబుతున్నారు. పాము కూడా భక్తుల కాళ్లను తాకుతూ వెళుతోందే తప్ప ఏమీ చేయక పోవడం గమనార్హం. సుబ్రహ్మణ్య స్వామి తమ గ్రామానికి వచ్చాడని భావిస్తున్న ప్రజలు, శ్రావణ మాసంలోగా గుడి కట్టిస్తామని తేల్చి చెబుతున్నారు. నేటికి సరిగ్గా 26 రోజుల క్రితం ఓ రైతుకు పొలంలో కనిపించిన ఈ పాము, నాటి నుంచి అక్కడే తిరుగాడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News