MRP: ఆగని మల్టీప్లెక్సుల దోపిడీ... ప్రభుత్వ రూల్స్ పట్టించుకోని పీవీఆర్, ఐనాక్స్, సినీమ్యాక్స్

  • నిన్నటి నుంచి అమలులోకి ఎంఆర్పీ ధరలు
  • పాటించని బడా మల్టీ ప్లెక్సులు
  • రహస్య కెమెరాలతో చిత్రీకరించిన టీవీ చానల్స్

ఆగస్టు 1 నుంచి హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఎంఆర్పీ ధరలకే తినుబండారాలు, పానీయాలు విక్రయించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు తొలి రోజే బేఖాతరు అయ్యాయి. పలు టీవీ చానళ్లు నిన్న మాల్స్ పై నిఘా పెట్టి, రహస్య కెమెరాలతో వెళ్లి మాల్స్ లో జరుగుతున్న అధిక ధరల దందాను వీడియో తీసి మరీ తమ తమ చానళ్లలో చూపుతున్నాయి. థియేటర్లలో ప్రతి ఉత్పత్తి ధరా బయటి రేటుతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. 20 రూపాయల విలువైన కూల్ డ్రింక్ ధరను 120 నుంచి 130 రూపాయల వరకూ పెంచి అమ్ముతున్నారని తెలుస్తోంది.

హైదరాబాద్ లో ప్రముఖ మాల్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ మ్యాక్స్ లో టీవీ 9, ఏబీఎన్, ఎన్ టీవీ తదితర తెలుగు వార్తా చానళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశాయి. పీవీఆర్ సెంట్రల్ లో పాప్ కార్న్ ప్యాకెట్ ను రూ. 125కు విక్రయించారు. 650 ఎంఎల్ కూల్ డ్రింక్ పై రూ. 180 వరకూ వసూలు చేశారు. కాంబోల పేరిట రూ. 300 వరకూ దోచుకున్నారు. తినుబండారాల ధరలు తగ్గుతాయని భావించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. కూకట్ పల్లి ప్రాంతంలోని సీనీ పోలిస్ లో వాటర్ బాటిల్ కు రూ. 80 వరకూ, కూల్ డ్రింక్ కు రూ. 160 వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. కొన్ని మాల్స్ తమకింకా ఉత్తర్వులు అందలేదని అడిగిన వారిపై వాదనలకు దిగాయి.

బంజారాహిల్స్ లోని ఐనాక్స్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కింద ఫ్లోర్ లో కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ ను కూడా థియేటర్ లోనికి తీసుకెళ్లే వీలు లేదని ఓ ప్రేక్షకుడిని అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. తాను గ్రౌండ్ ఫ్లోర్ లో కొనుగోలు చేశామని సదరు ప్రేక్షకుడు చెప్పి, బిల్లును చూపించినా, సెక్యూరిటీ సిబ్బంది వినలేదు. ఐనాక్స్ ఫుడ్ కోర్టులో కాంబో పేరిట పాప్ కార్న్, కోక్ కు రూ. 500కు పైగానే వసూలు చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం పరిస్థితి కొంత మారిందని, ఎంఆర్పీ ధరలకే వాటర్, కూల్ డ్రింక్స్, తినుబండారాలు లభిస్తున్నాయని ప్రేక్షకులు వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా, మల్టీ ప్లెక్సుల్లో అధిక ధరలపై ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్స్ యాప్ నంబరు 7330774444ను సంప్రదించాలని తూనికలు, కొలతల శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News