kodela: ఏపీ స్పీకర్ గా గౌరవనీయమైన స్థానంలో ఉండి జాతిని తప్పుదోవ పట్టిస్తారా?: కేవీపీ విమర్శలు

  • ‘పోలవరం’ విషయంలో జాతిని తప్పుదోవ పట్టించొద్దు
  • 1941 నుంచి 2014 వరకు కేవలం 2% పనే జరిగిందా?
  • ఆ తర్వాత 56% పనులు పూర్తయ్యాయా?

కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు శాతమే జరిగాయనడం కరెక్టు కాదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దాదాపు మూడువేల మంది రైతులను తీసుకుని అట్టహాసంగా ‘పోలవరం’ సందర్శన యాత్ర చేసి పోలవరం ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలిసేలా చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

అలాగే, పోలవరం సందర్శించిన తర్వాత జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ..1941 నుంచి 2014 వరకు కేవలం రెండు శాతం పని జరిగిందని, ఇక అప్పటి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కార్యదక్షత, చొరవ వల్ల ప్రాజెక్ట్ ను ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రిగారికి అప్పగించగానే ప్రాజెక్టు 56% పూర్తయిందని.. మీరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా గౌరవనీయమైన స్థానంలో ఉన్న మీరు ఉద్దేశపూర్వకంగా ఇలా జాతిని తప్పుదోవ పట్టిస్తారని కనీసం కలలో కూడా ఎవరూ అనుకోరు.

అయితే, పోలవరం గురించి మీకు ప్రభుత్వం అందించిన సమాచారాన్ని.. పోలవరాన్ని చూసి మీరు పులకించిపోయి ఉన్న దశలో మీకు ఇవ్వడం వల్ల.. ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకునే సమయంలేక, దానిలో సత్యాసత్యాలను గ్రహించలేక.. ప్రజలకు ఈ విధంగా చెప్పారని అనుకోవలసి వస్తున్నది.

అయ్యా.. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలతో పని ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాబట్టి.. వారిని మాయ చేయడానికి తప్పుడు లెక్కలు చెబుతుంటారని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు సరిగా చెప్పడం లేదని.. వివిధ పథకాల నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను తన పేరుతో ప్రచారం చేసుకొంటూ కేవలం ఎన్నికలలో లబ్ధి కోసం తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. 

అయితే, ప్రజలను, మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను..తప్పుడు లెక్కలతో మాయ చేసినట్టు..శాసన సభాపతి వంటి గౌరవనీయమైన రాజ్యాంగపు పదవిలో ఉన్న మీకు కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి.. మీతో ఈ విధంగా ‘పోలవరం’ విషయంలో జాతిని తప్పుదోవపట్టించేలా ప్రసంగం చేయించి.. ప్రజల ముందు, ‘పోలవరం’ గురించి వాస్తవాలు తెలిసిన వారి ముందు.. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మిమ్మల్ని కూడా స్వార్థ రాజకీయాలకు పావుగా వాడుకోవాలనుకోవడం చాలా బాధ కలిగిస్తున్నది.

గౌరవనీయమైన, ఉన్నతమైన స్థానంలో ఉన్న మీకే ఇలా తప్పుడు సమాచారం ఇస్తే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో విజ్ఞులు మీకు తేలికగానే అర్థం అవుతుందని భావిస్తున్నాను. ఇక పోలవరం విషయంలో.. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పక్కనబెడితే, వాస్తవమైన సమాచారాన్ని మీకు ఇవ్వడం ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. 

1941లో ప్రాజెక్టు భావన కార్యరూపం దాల్చినప్పటి నుంచి 2014 వరకు ఈ ప్రాజెక్టులో కేవలం 2% పని మాత్రమే పూర్తి అయిందని చెప్పడం ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే..’ అని కేవీపీ విమర్శించారు.     

More Telugu News