Asson: "పౌరయుద్ధం, రక్తపుటేరులు తప్పవు" అన్న మమతా బెనర్జీపై అసోంలో పోలీసు కేసు!

  • అసోం ఎన్ఆర్సీ జాబితాతో కలకలం
  • 40 లక్షల మంది పేర్లు గల్లంతు
  • ప్రజలను రెచ్చగొట్టేలా మమత మాట్లాడారని కేసు

అసోం పౌరసత్వ జాబితా ముసాయిదాలో 40 లక్షల మంది పేర్లు మాయం కావడం, అందులో అత్యధికులు బెంగాలీలు ఉండటంపై తీవ్రంగా స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో పౌరయుద్ధం జరగనుందని, రక్తపుటేరులు తప్పవని ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా మాట్లాడినందున ఆమెపై కేసు నమోదు చేశామని అసోం పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  అసోంలోని బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు ఆమె వ్యాఖ్యలను పరిశీలించి కేసు పెట్టినట్టు తెలిపారు.

కాగా, అసోం జనగణన తరువాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని కేంద్రం విడుదల చేయగా, తీవ్ర రభస మొదలైన సంగతి తెలిసిందే. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువుల పేర్లు కూడా ఈ జాబితాలో మాయం అయ్యాయి. దీనిపై రాజ్యసభలో మంగళవారం నాడు పెద్ద గొడవే జరిగింది. మరోపక్క బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు.

More Telugu News