Uttar Pradesh: మహిళా ఎమ్మెల్యే ఆలయ ప్రవేశం చేయడంతో.. గంగాజలంతో శుద్ధి చేసిన గ్రామస్థులు!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మనీషా అనురాగి
  • వెళ్లాక గంగాజలంతో ప్రక్షాళన.. మండిపడిన ఎమ్మెల్యే

మహిళా ఎమ్మెల్యే ఆలయంలోకి ప్రవేశించారన్న కారణంతో గ్రామస్థులు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలోని ముష్కర‌ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన. రాత్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే మనీషా అనురాగి గ్రామాన్ని సందర్శించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ధూమ్ర రుషి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

ధూమ్రరుషి మహాభారత కాలానికి చెందిన వారట. రుషి కళ్లెదుట మహిళలు ఉంటే ఊరికి అరిష్టమని గ్రామస్థులు భావిస్తారు. అందుకనే ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిషేధించారు. దీనిని అతిక్రమిస్తే గ్రామం నాలుగు దశాబ్దాలపాటు కరువు కాటకాలలో చిక్కుకుంటుందని నమ్ముతారు. విషయం తెలియని ఎమ్మెల్యే ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో తమ గ్రామానికి అరిష్టం తప్పదని భావించిన గ్రామ పంచాయతీ వెంటనే సమావేశం అయింది.

గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేయాలని అందరూ కలిసి నిర్ణయించి గంగాజలం తీసుకొచ్చి ఆలయం మొత్తాన్నిశుద్ధి చేశారు. మహర్షి రూపాన్ని పోలిన విగ్రహాన్ని అలహాబాద్ త్రివేణి సంగమ క్షేత్రానికి తీసుకెళ్లి స్నానం చేయించారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే అనురాగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం మహిళలను, రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని మండిపడ్డారు.

More Telugu News