Pawan Kalyan: కాపు రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: పవన్ కల్యాణ్

  • ‘జనసేన’ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం 
  • రిజర్వేషన్ అంశంపై అధ్యయనానికి చర్చలు
  • ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయొద్దు

కాపుల రిజర్వేషన్ల అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కాపుల రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విస్తృత సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలపైన, రిజర్వేషన్ల అంశంపైన చర్చించారు.

రిజర్వేషన్ల విషయాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వాడుకొంటున్నాయని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అభిప్రాయపడింది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే ముఖ్యమంత్రి కూడా కులాల మధ్య చిచ్చు రేపే విధంగా రిజర్వేషన్ల విషయంలో వ్యవహరించడం, ఈ విషయంపై ప్రతిపక్ష నేత ఏడాదికో మాట మార్చడం చూస్తుంటే.. రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకొనే ఆ పార్టీలు రాజకీయ క్రీడలు ఆడటం కాక మరేమవుతుందని కమిటీ వ్యాఖ్యానించింది. నాలుగు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, రెండు దశాబ్దాలు పీఠం మీద ఉన్న తెలుగుదేశం పార్టీలకు రిజర్వేషన్లపై  నిశ్చితాభిప్రాయం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గందరగోళంతో, కులాల మధ్య దూరాలు పెంచి ప్రయోజనాన్ని పొందే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని, ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేసేందుకు నిపుణులతో చర్చించాలని ఆయన నిర్ణయించారు. అర్హులైన వర్గాలన్నింటికీ రాజకీయ ఫలాలు అందాలని చెప్పారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందని అన్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని, పాలకులు ఈ విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లోని లోపాల మూలంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.

అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అయ్యారు. పార్టీపరంగా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ‘వీర మహిళ’, ‘ఆజాద్ యూత్’ విభాగాల నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. జనసేన మేనిఫెస్టో రూపకల్పన, విద్యార్థి విభాగానికి సంబంధించిన చర్చను రేపు నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా సాధన, భూసేకరణ చట్టం పరిరక్షణ అంశాలపైనా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News