North California: ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు దుర్ఘటన: 'తాతయ్యా... కాపాడు' అని అరుస్తూ ప్రాణాలు వదిలిన ఐదేళ్ల చిన్నారి!

  • ఉత్తర కాలిఫోర్నియాలో ఇళ్లపైకి కార్చిచ్చు
  • వృద్ధురాలు, ఇద్దరు చిన్నారులు సజీవదహనం
  • మరో 5 వేల ఇళ్లకు ముప్పు ఉందంటున్న అధికారులు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిని బలిగొంది. ఇంట్లోకి కార్చిచ్చు వ్యాపిస్తుంటే, దిక్కు తోచని స్థితిలో 'తాతయ్యా... కాపాడు' అని అరుస్తూ, సజీవ దహనమయ్యాడా చిన్నారి. లేక్ ఫోర్డ్ పట్టణంలో నాలుగు ఇళ్లకు నిప్పంటుకోగా, ఇప్పటివరకూ 8 మంది మృతిచెందారు. వారిలో బెల్డ్ సోయి అనే వృద్ధుడి ముని మనవడు కూడా ఉన్నాడు. తాను పనిమీద బయటకు వెళ్లానని, ఆ సమయంలో మంటలు ఇంటి మీదకు వస్తున్నాయని తన భార్య మెలోడీ ఫోన్ చేసిందని, ఆమె భయాన్ని చూసి, జరగబోయే ప్రమాదాన్ని గమనించి పరుగున ఇంటికి వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని ఆయన వాపోయాడు.

 'తాతయ్య రా.. నన్ను కాపాడు' అని ముని మనవడు జేమ్స్ రాబర్ట్స్ పిలుస్తుంటే, తన ముసలి గుండె బద్దలైందని అన్నాడు. మంటలు తనను లోనికి వెళ్లనివ్వలేదని చెప్పాడు. కాగా, ఈ ప్రమాదంలో బెల్డ్ సోయి భార్య మెలోడీ, ఆయన ముని మనవడు జేమ్స్ ఎమిలీ కూడా సజీవ దహనం అయ్యారు. సోమవారం నాటికి దాదాపు లక్ష ఎకరాలను మంటలు కబళించాయని చెప్పిన అధికారులు, 700కు పైగా గృహాలు దగ్ధమయ్యాయని, మరో 5 వేలకు పైగా గృహాలు ప్రమాదంలో ఉన్నాయని, వాటి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.

More Telugu News