Uttar Pradesh: కుదిరిన మెగా యూపీ డీల్... కలిసిన కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ!

  • నరేంద్ర మోదీని నిలువరించడమే లక్ష్యం
  • యూపీలో కుదిరిన పొత్తు
  • అధిక సీట్లు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి
  • సమాజ్ వాదీ కోటా నుంచి ఆర్ఎల్డీకి 3 సీట్లు

యూపీలో బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా మెగా డీల్ కుదిరింది. ఈ మేరకు కాంగ్రెస్ పలు చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడంలో సఫలమైనట్టు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, దళిత శక్తిగా పేరు తెచ్చుకున్న మాయావతి, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ కలసి తదుపరి ఎన్నికల బరిలోకి దిగుతాయని తెలుస్తోంది. యూపీలో ఎక్కువ సీట్లను గెలుచుకుంటే, కేంద్రంలో అధికారాన్ని సులువుగా దక్కించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో విజయవంతమైందని సమాచారం.

ఈ సంవత్సరం యూపీలో గోరఖ్ పూర్, ఫుల్ పూర్, ఆ తరువాత ఖైరానా, నూర్ పూర్ సీట్లను గెలుచుకున్న విపక్షాలు, సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకోగా, శరద్ పవార్, మమతా బెనర్జీలు కూటమి ఏర్పడేందుకు తమవంతు పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. గత వారంలో మాయావతిని కలిసిన శరద్ పవార్, సీట్ల పంపిణీపై న్యాయం చేస్తామని చెబుతూ ఆమెను ఒప్పించారట.

ఈ సంవత్సరం చివరిలో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, విపక్షాలన్నీ కలసి పోటీ చేసి సత్తా చాటాలని, ఆపై ఫలితాలను బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేద్దామని మాయావతికి చెప్పిన పవార్, ఆమెను పొత్తునకు అంగీకరించేలా చేశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

 మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, బీఎస్పీ 50 సీట్లను డిమాండ్ చేయగా, కాంగ్రెస్ 22 సీట్లను ఆఫర్ చేసింది. పవార్ మధ్యవర్తిత్వంతో 30 సీట్ల వరకూ బేరం వచ్చినట్టు సమాచారం. ఇక యూపీలోనూ ఈ మూడు ప్రధాన పార్టీలు కలసే పోటీ చేస్తాయని సమాజ్ వాదీ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ కోటా నుంచి అజిత్ సింగ్ కు కొన్ని సీట్లను ఆఫర్ చేయడం ద్వారా, ఆర్ఎల్డీనీ కూటమి కిందకు తీసుకు వచ్చే ప్రయత్నాన్ని సఫలం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పొత్తులో భాగంగా యూపీలోని అధిక ఎంపీ సీట్లను మాయావతికి ఇచ్చి, సుమారుగా 32 సీట్లకు ఎస్పీ, మూడు సీట్లకు ఆర్ఎల్డీ పోటీ పడతాయని, తమ కూటమి మొత్తం 80 సీట్లనూ గెలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ స్థానిక పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే శరద్ పవార్ తో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుండగా, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ తో మరోసారి మహా కూటమిని ఏర్పాటు చేసుకుని పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News