Maharashtra: మళ్లీ భగ్గుమన్న మహారాష్ట్ర.. రోడ్డెక్కిన మరాఠాలు.. 40 బస్సులకు నిప్పు!

  • 72 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
  • రోడ్డెక్కిన మరాఠ్వాడాలు
  • శ్రుతి మించడంతో ఉద్రిక్తత

విద్య, ఉపాధి అవకాశాల్లో తమ కోసం ప్రత్యేక కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మరాఠాలు మరోమారు రోడ్డెక్కారు. వారి ఆందోళనలు కాస్తా శ్రుతి మించడంతో ఉద్రిక్తంగా మారింది. పూణె, నాసిక్ సహా మరాఠ్వాడా ప్రాంతమంతా ఆందోళనలు మిన్నంటాయి. రిజర్వేషన్లు కల్పించాలని నినాదం చేస్తూ ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. మరో వ్యక్తి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణాలతో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ఉస్మానాబాద్‌, షోలాపూర్‌, కొల్హాపూర్‌, నన్‌దర్బార్‌, ఔరంగాబాద్‌, బీడ్‌ జిల్లాలన్నీ సంపూర్ణంగా బంద్‌ పాటించాయి.

మరోవైపు పూణెలోని చకన్ ప్రాంతంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు 40 బస్సులకు నిప్పు పెట్టారు. వందకు పైగా వాహనాలను ధ్వంసం చేశారు. పూణె నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులను స్తంభింపజేశారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా, పోలీసులపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. లాతూరులో 22 జిల్లాల నేతలు సమావేశమయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించే వరకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.

మరాఠ్వాడాలు నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. 72వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మరాఠ్వాడాలు ఈ ఆందోళనకు దిగారు.

More Telugu News