Rangam: నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు... అంతా మీవల్లే: భవిష్యవాణిలో స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు

  • భక్తులకు సంతోషం లేకుండా పోయింది
  • ఆనందంగా రావాల్సిన భక్తులు బాధతో వస్తున్నారు
  • ప్రజలందరికీ అండగా ఉంటానన్న స్వర్ణలత

తన భక్తులకు సంతోషం లేకుండా పోయిందని, ప్రతియేటా ఆనందంగా తన వద్దకు వచ్చే భక్తులు, ఈ సంవత్సరం బాధతో వస్తున్నారని భవిష్యవాణిని వినిపిస్తూ, స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయానికని వచ్చిన ఆడపడుచులు శోకిస్తూ వెళుతున్నారని, ఈ సంగతిని ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళల సౌకర్యం కోసం ఆలయంలో ఎంతో చేస్తున్నామని నిర్వాహకులు చెబుతూ, సంతోషం లేదంటే తామంతా ఏమై పోవాలని ప్రశ్నించగా, "నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయిరా బాలకా... ఏం మాట్లాడుతున్నావురా బాలకా నువ్వు? ప్రత్యక్షంగా నీ కళ్లతో చూసి చెప్పు" అంటూ గద్దించింది.

అమ్మ మనసులోని కోరికేంటో చెప్పాలని కోరగా, తన ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తనదని, మీరు మాత్రం ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని ఆదేశిస్తూ, అదే తన కోరికని చెప్పింది. ఆలయంలో ఇంతమంది సిబ్బంది ఉండి కూడా లాభం లేకుండా పోయిందని, ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారే తప్ప కీడు చేస్తున్నారని ఆరోపించింది. ఆ సమయంలో ప్రధాన పూజారి కల్పించుకుని, నీ దగ్గరకు భక్తితో వచ్చేవారికి శాపాలు పెట్టడం తప్పు తల్లీ... అంటూ అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తానేమీ శాపాలు పెట్టడం లేదని, తనకు ఆడపడుచులంతా ఒకటేనని, మీకు తెలియాలనే విషయం చెబుతున్నానని, తాను మాత్రం అందరినీ సంతోష పెడతానని వ్యాఖ్యానించింది. ఆపై ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకుంటామని, ఆ అవకాశం తమకు ఇవ్వాలని పూజారి వ్యాఖ్యానించారు.

More Telugu News