Narendra Modi: 'మోదీపై రసాయన దాడి జరుగుతుంది' అంటూ యువకుడి ఫోన్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!

  • జార్ఖండ్ కు చెందిన సెక్యూరిటీ గార్డ్ నిర్వాకం
  • ఐదు గంటల్లోనే పట్టుకున్న పోలీసులు
  • మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే చేశానని యువకుడి ఒప్పుకోలు

ప్రధాని నరేంద్ర మోదీపై రసాయన దాడి జరగబోతోందని ఏకంగా జాతీయ భద్రతా దళాని(ఎన్ఎస్జీ)కే ఫోన్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. సీన్ కట్ చేస్తే, ఐదు గంటల్లోనే అతడిని అరెస్ట్ చేసిన అధికారులు.. కటకటాల వెనక్కి నెట్టారు. ముంబైలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్ కు చెందిన కాశీనాథ్ మండల్(21) ముంబైలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఇంటర్నెట్ లో జాతీయ భధ్రతా దళం ఫోన్ నంబర్ సేకరించిన మండల్.. ప్రధాని మోదీపై రసాయన దాడి జరగబోతోందని ఉదయం 10.30 గంటలకు ఎన్ఎస్జీకి ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంబై పోలీసులకు సమాచారమిచ్చారు. చివరికి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఐదు గంటల్లోనే నిందితుడ్ని రైల్వే స్టేషన్ లో పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.


కాగా, దేశంలో భయం, మత ఘర్షణలు రేకెత్తించేందుకు తాను ఈ కాల్ చేసినట్లు మండల్ పోలీసులకు తెలిపాడు. ఇతను రెండు వారాల క్రితం ఉద్యోగం మానేసి సొంతూరికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మండల్ ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News