Supreme Court: విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదు, తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు!: తేల్చి చెప్పిన కేంద్రం

  • సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు
  • పదో షెడ్యూల్ సంస్థల విభజన అవసరం లేదు
  • 753 మంది ఉద్యోగులను విభజించాల్సి వుందన్న హోమ్ శాఖ టాస్క్ ఫోర్స్

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ తో పాటు, తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదని హోమ్ శాఖ టాస్క్ ఫోర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే టాస్క్ ఫోర్స్ విభాగం ఈ అఫిడవిట్ ను దాఖలు చేయడం గమనార్హం.

ఇదే సమయంలో పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన అవసరం లేదని, ఏ ప్రాంతంలో ఉన్న భవంతులు, ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని కూడా స్పష్టం చేసింది. ఈ సంవత్సరం మూడు సార్లు విభజన చట్టం అమలుపై సమావేశాలు నిర్వహించామని చెబుతూ, వాటికి సంబంధించిన మినిట్స్ ను కోర్టుకు ఇచ్చిన అధికారులు, ఇప్పటికే రాష్ట్రంలో 16 రైల్వే జోన్ లు ఉన్నాయని, కొత్త జోన్ అవసరం లేదని, పెట్టినా లాభదాయకం కాదని చెప్పింది. దేశంలో ఉన్న ఐదు కోచ్ ఫ్యాక్టరీలే సరైన ఉపయోగంలో లేని వేళ, మరో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే, విశాఖలో జోన్ ఏర్పాటుకు ఓ కమిటీని వేశామని, తుది నిర్ణయం తదుపరి తీసుకుంటామని చెప్పింది.

ఇక షెడ్యూల్ 10లోని సంస్థలను గురించి ప్రస్తావిస్తూ, ఒక రాష్ట్రంలోని సంస్థ నుంచి మరో రాష్ట్రానికి పదేళ్ల పాటు సేవలందుతాయని సెక్షన్ 75 వివరిస్తోందని గుర్తు చేసింది. షెడ్యూల్ 10 సంస్థలను విభజించే విషయమై నిబంధనలేమీ ఖరారు కాలేదని ఏపీ వెల్లడించగా, తెలంగాణ నుంచి ఏ విధమైన స్పందనా రాలేదని పేర్కొంది. కొన్ని న్యాయ, పరిపాలనా పరమైన కారణాలతో 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్ లో ఉందని వెల్లడించింది.

More Telugu News