amit shah: యూపీలో షా కాన్వాయ్ ను అడ్డుకున్న యువతులపై పోలీసుల దౌర్జన్యం

  • లాఠీతో కొట్టి జుట్టు పట్టి జీపులోకి తోసిన అధికారులు
  • వీరంతా సమాజ్ వాదీ ఛాత్ర్ సభ సభ్యులన్న పోలీసులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అలహాబాద్ పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు రెచ్చిపోయారు. షా కాన్వాయ్ ను అడ్డుకుని నల్ల జెండాలు ప్రదర్శించిన ఇద్దరు యువతుల్ని పక్కకు లాక్కెళ్లిన పోలీసులు లాఠీతో కొట్టారు. ఈ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ రోజు ర్యాలీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న అమిత్ షా కాన్వాయ్ ను అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు యువతులు, ఓ యువకుడు అడ్డుకున్నారు. అనంతరం నల్లజెండాలను ప్రదర్శించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని పక్కకు ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా యువతుల్ని జీపులోకి ఎక్కిస్తుండగా.. ఓ పోలీస్ అధికారి లాఠీతో ఒకామెను చావగొట్టాడు. ఇంకో యువతిని పోలీసులు జుట్టు పట్టి జీపులోకి తోశారు. దీంతో అక్కడే ఉన్న మరో అధికారి విద్యార్థుల్ని కొట్టవద్దని తన సహచరుల్ని వారించాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, అమిత్ షా కాన్వాయ్ ను అడ్డుకున్న నేహా యాదవ్(25), రామా యాదవ్(24), కిషన్ మౌర్యలు సమాజ్ వాదీ పార్టీ  విద్యార్థి విభాగం సమాజ్ వాదీ ఛాత్ర్ సభకు చెందినవారని పోలీసులు తెలిపారు. అలహాబాద్ వర్శిటీలో నేహా పీహెచ్ డీ చేస్తుండగా, రామా పీజీ చదువుతోందని వెల్లడించారు.


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే ర్యాలీలు, సమావేశాల్లో నలుపురంగు జెండాలు, దుస్తులు, చేతి రూమాళ్లను తీసుకురావడాన్ని పోలీసులు నిషేధించిన సంగతి తెలిసిందే. యోగి వెళ్లిన ప్రతిచోట ప్రతిపక్షాలు నలుపు రంగు జెండాలను ప్రదర్శించడంతో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News