roja: రోడ్డు ప్రమాదంలో మరణించిన సుమతి కుటుంబాన్ని ఆదుకోండి: రోజా డిమాండ్

  • నగరి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
  • టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి
  • వేల్ మురుగన్ స్టోన్ క్రషర్ ను సీజ్ చేయాలంటూ రోజా డిమాండ్
నగరి నియోజకవర్గంలోని చెన్నై-తిరుపతి జాతీయ రహదారిలో నిన్న సంభవించిన రోడ్డు ప్రమాదంలో సుమతి (45) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. తన కుమారుడు ప్రతాప్ తో కలసి ద్విచక్ర వాహనంపై నగరి కోర్టు నుంచి తన గ్రామానికి ఆమె బయలుదేరారు. మండపం వద్ద నగరి నుంచి తిరుపతి వైపు కంకరతో వస్తున్న ఓ టిప్పర్ వీరి బైకును వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తల నుజ్జునుజ్జై మరణించింది. ఆమె కుమారుడు ప్రతాప్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.

సరిగ్గా ఇదే సమయంలో రోజా నగరిలో జరుగుతున్న వైయస్సార్ క్రికెట్ టోర్నీలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే... ఆమె ఘటనా స్థలికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. వేల్ మురుగన్ స్టోన్ క్రషర్ తరచూ రోడ్డు ప్రమాదాలకు, కాలుష్యానికి కారణమవుతోందని... దాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మురుగన్ స్టోన్ క్రషర్ పై తాను ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరి సీఐ, పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై కొండలను పిండి చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన సుమతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 
roja
YSRCP
nagari
accident

More Telugu News