Rajasthan: బాబర్ కి తండ్రి హుమయూన్?... రాజస్థాన్ బీజేపీ నేతగారి చరిత్ర పాఠాలు!

  • మత విశ్వాసాలను అందరూ గౌరవించాలని వ్యాఖ్య
  • తండ్రిని కుమారుడిగా పేర్కొనడంపై నెటిజన్ల మండిపాటు
  • చరిత్ర వక్రీకరణ బీజేపీకి అలవాటైపోయిందని కాంగ్రెస్ విమర్శ

ఆవులు, మహిళలు, బ్రాహ్మణుల్ని అవమానించవద్దని మొఘల్ రాజు హుమయూన్ తన చివరి ఘడియల్లో కుమారుడు బాబర్ కు చెప్పాడని రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ తెలిపారు. రాజస్తాన్ లో రక్బర్ ఖాన్ ను గోరక్షకులు కొట్టిచంపడంపై స్పందిస్తూ.. సమాజం, దేశం, మతాల నమ్మకాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అయితే తండ్రిని కుమారుడిగా, కుమారుడిని తండ్రిగా సైనీ పేర్కొనడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.


జైపూర్ లో ఓ మీడియా సంస్థతో సైనీ మాట్లాడుతూ.. ‘‘చివరి ఘడియల్లో హుమయూన్ తన కుమారుడు బాబర్ ను పిలిపించుకున్నాడు. ‘నువ్వు భారత్ ను పరిపాలించాలనుకుంటే మూడు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవి.. ఆవులు, మహిళలు, బ్రాహ్మణులు. వీళ్ల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు’ అని హుమయూన్ చెప్పాడు. ఈ మూడు విషయాల్లో అలసత్వం వహిస్తే భారత్ సహించబోదని హెచ్చరించాడు’’ అని సైనీ పేర్కొన్నారు.


అయితే బాబర్ కుమారుడైన హుమయూన్ ను సైనీ ఏకంగా బాబర్ కు తండ్రిని చేసేయడంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. బాబర్ 1530లోనే చనిపోతే, హుమయూన్ 1556 చనిపోయాడనీ.. మరి ముందే చనిపోయిన బాబర్ కు హుమయూన్ ఈ విషయాలు ఎలా చెప్పాడని ప్రశ్నిస్తున్నారు. కాగా, బీజేపీ నేతలకు చరిత్రను వక్రీకరించడం అలవాటైపోయిందని రాజస్తాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ మండిపడ్డారు.

More Telugu News