Telugudesam: ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త.. చికిత్స పొందుతూ మృతి!

  • పక్షవాతంతో బాధపడుతున్న విజయ్ తండ్రి
  • టీడీపీకి ఎంతో సేవ చేసినా ఆదుకోలేదని ఆరోపణ
  • తన చావు తరువాతైనా ఆదుకోవాలని వేడుకోలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తూర్పు దళితవాడకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్, ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ, తన తండ్రి టీడీపీకి ఎంతో సేవ చేశారని, ఆయన పక్షవాతంతో బాధపడుతూ ఉంటే ఎవరూ ఆదుకోలేదని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన తండ్రి ఎడ్ల దాసు తెలుగుదేశం స్థానిక నేతగా ఎంతో కాలం సేవలందించారని చెప్పిన విజయ్, ఇప్పుడాయన ఆసుపత్రి ఖర్చులకు, తమ కుటుంబం మొత్తం సంపాదన కూడా సరిపోవడం లేదని చెప్పుకొచ్చాడు.

చీరాల సమీపంలోని రామాపురం బీచ్ కి పురుగుల మందు డబ్బాతో వెళ్లిన విజయ్, అక్కడ ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన మరణం తరువాతైనా తెలుగుదేశం నేతలు స్పందించి తండ్రిని బతికించాలని వేడుకున్నాడు. కాగా, దాసుకు విజయ్ చిన్న కుమారుడు. ఇంటర్ వరకూ చదివిన విజయ్, ప్రస్తుతం భవన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బీచ్ లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న విజయ్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

  • Loading...

More Telugu News