Hanan Hamid: చదువుల తల్లికి ఆన్ లైన్ వేధింపులు.. అండగా నిలిచిన కేంద్ర మంత్రి!

  • కేరళ నర్సింగ్ విద్యార్థి హనన్ కు ఆన్ లైన్ ట్రోలింగ్
  • ఆకతాయిలపై మండిపడ్డ కేంద్ర మంత్రి అల్ఫోన్స్
  • సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించిన దర్శకుడు గోపీ

ఆమె కేరళకు చెందిన ఓ నిరుపేద విద్యార్థిని. అయితేనేం, కళాశాల ముగియగానే ఓపక్క చేపలు అమ్ముకుంటూ.. మరోపక్క చదువులో దూసుకుపోతుంది. చదువుపై సదరు యువతికున్న మక్కువపై 'మాతృభూమి' పత్రిక రెండ్రోజుల క్రితం ఓ కథనం ప్రచురించడంతో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీంతో సాక్షాత్తూ కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన హనన్ హమీద్(21) స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. తండ్రి తాగుడుకు బానిస కావడం, తల్లి అనారోగ్యం పాలవడంతో కళాశాల ముగిశాక చేపలు అమ్ముతూ కుటుంబాన్నిపోషిస్తోంది. దీంతో హనన్ గురించి ప్రముఖ మలయాళ పత్రిక 'మాతృ భూమి' ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.

సినిమా తారలు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రజలు ఈ కథనంపై సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందించగా, మరికొందరు ఆకతాయిలు మాత్రం యువతిని విమర్శించడం మొదలుపెట్టారు. పత్రికలో ప్రచురితమైన కథనం వాస్తవం కాదని ఆరోపించారు. దీంతో తనకు ఎలాంటి సాయం అక్కర్లేదనీ, ప్రశాంతంగా తన మానాన తనను వదిలేయాలని హనన్ కన్నీళ్లతో విజ్ఞప్తి చేసింది.

అయితే ఓవైపు చదువు, మరోవైపు జీవనోపాధిని సమన్వయం చేసుకుంటున్న హనన్ కు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ మద్దతుగా నిలిచారు. ’కేరళ సొర చేపల్లారా.. హనన్ ను వేధించడం ఆపండి. మీ చర్యల వల్ల నేను తీవ్రంగా సిగ్గుపడుతున్నా. జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి యత్నిస్తుంటే మీరు రాబందుల్లా వ్యవహరిస్తున్నారు‘ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కాగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ తో తాను తెరకెక్కిస్తున్న చిత్రంలో హనన్ కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News