అనుచిత వ్యాఖ్యలు చేసి 'చింతిస్తున్నా'నన్న టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని!

  • రేణిగుంట విమానాశ్రయంలో ఘటన
  • తిరుపతికి వచ్చిన దేవెగౌడ, కుమారస్వామి
  • స్వాగతం చెప్పేందుకు వెళ్లిన బొల్లినేనిని అడ్డుకున్న సిబ్బంది
  • జేసీ, తహసీల్దారుపై వీరంగమాడిన బొల్లినేని
రేణిగుంట ఎయిర్ పోర్టులో చిత్తూరు జాయింట్ కలెక్టర్ గిరీషా, రేణిగుంట తహసీల్దారు నర్సింహులుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆపై జరిగిన దానికి చింతిస్తున్నట్టు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి దేవెగౌడ తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే బొల్లినేని వారికి స్వాగతం చెప్పేందుకు రాగా, కొందరు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించిన ఆయన, తనను పక్కన బెట్టారని మండిపడుతూ, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపైనా చిందులేశారు. తహసీల్దారుపై తిట్లపురాణానికి దిగిన ఆయన, సీఎం చంద్రబాబుకు చెప్పి, మీ కథ తేలుస్తానని హెచ్చరించారు. జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బొల్లినేని వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగులు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో, బొల్లినేని జరిగిన దానికి చింతిస్తున్నట్టు తెలిపారు. దీంతో వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని తహసీల్దారు నరసింహులు తోటి ఉద్యోగులకు సర్దిచెప్పారు.
Go Back to Shorts
Telugudesam
Tirupati
Renigunta
Bollineni Ramarao

More Telugu News