Facebook: ఫేస్ బుక్ లో భారతీయుల వివరాల చోరీపై సీబీఐ విచారణ

  • కేంబ్రిడ్జ్ అనలిటికా స్పందించకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం
  • రాజ్యసభకు తెలిపిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
  • సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

బ్రిటన్ కు చెందిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఫేస్ బుక్ లో భారతీయుల వివరాలను తస్కరించిందో లేదో తెలుసుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది. భారతీయుల వివరాల చోరీ విషయమై కేంద్రం పంపిన నోటీసులకు సీఏ స్పందించకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభకు తెలిపారు.

 తాము భారతీయుల డేటా తీసుకోలేదని సీఏ యాజమాన్యం చెప్పినప్పటికీ.. ఫేస్ బుక్ ఇచ్చిన నివేదికతో వారి వివరణ సరిపోలడం లేదన్నారు. వదంతుల వ్యాప్తికి సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రసాద్ సూచించారు. మూకదాడులు, అల్లర్లు, వదంతుల్ని అరికట్టేందుకు ఈ సంస్థలు పరిష్కారం కనుగొనాలన్నారు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ కు అనుకూలంగా అమెరికన్లను ప్రభావితం చేయడానికి దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్ బుక్ వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా తస్కరించినట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్ బయటపెట్టడంతో కలకలం రేగింది. ఈ సందర్భంగా సీఏ అనుబంధ సంస్థ భారత్ లోనూ తమ కార్యకలాపాలు కొనసాగించిందని ఆయన వెల్లడించారు. దీంతో సీఏతో అంటకాగింది మీరంటే మీరని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు విమర్శలు గుప్పించుకున్నాయి.

  • Loading...

More Telugu News