Kerala: తారస్థాయికి చేరిన కవిగారి పైత్యం.. గత జన్మలో నువ్వు నా భార్యవంటూ ఉద్యోగినికి వేధింపులు!

  • కవి సమ్మేళనంలో ఉద్యోగినితో పరిచయం
  • కవిత రూపంలో వేధింపులు
  • జైలుకెళ్లినా మారని తీరు

గత జన్మలో నువ్వు నా భార్యవని, నా శ్రీమతికి ఈ విషయం చెప్పి ఒప్పించానని, ఓకే అంటే ముగ్గురం కలిసి జీవిద్దామంటూ మహిళా ఉద్యోగిని వేధించిన కవిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం... ఒడిశాకు చెందిన ప్రముఖ కవి కేరళలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన కవితలతో ప్రసిద్ధి చెందిన ఆయన గతంలో రాజేంద్రనగర్‌లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జరిగిన కవి సమ్మేళనానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగినితో ఏర్పడిన పరిచయాన్ని పెంచుకుంటూ పోయాడు. సోషల్ మీడియా ద్వారా  చాటింగ్ కూడా కొనసాగించాడు. అయితే, అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో ఫ్రెండ్‌షిప్‌ను ఆమె కట్ చేసింది.

తనతో ఆమె మాట్లాడడం తగ్గించేయడంతో ఇద్దరి పేర్లూ కలిసి వచ్చేలో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి వేధింపులకు పాల్పడసాగాడు. ఆమెతో తన పరిచయాన్ని, అనుభూతులను కవితల్లా రాసి అందరికీ షేర్ చేయసాగాడు. పూర్వజన్మలో ఆమె తన భార్య అని, ఈ జన్మలోనూ తమ మనసులు కలిశాయని కవితల రూపంలో రాసుకొచ్చాడు.

అక్కడితో ఆగకుండా నేరుగా జమ్ముకశ్మీర్‌లోని మహిళ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలిసి విషయం చెప్పాడు. దీంతో వారు హెచ్చరించి పంపేశారు. అయినా, అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా, మరింత ముదిరింది. గత జన్మలో తామిద్దరం భార్యాభర్తలమనే విషయాన్ని ప్రస్తుత భార్యకు చెప్పి ఒప్పించానని, తనతో వస్తే ముగ్గురం కలిసి కాపురం చేద్దామని కొత్త ఆఫర్ ఇచ్చాడు.

దీంతో ఆమె గతేడాది సైబరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. తాజాగా మరోమారు వేధింపులకు దిగడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News