Facebook: ఫేస్ బుక్ కు భారీ నష్టం.. ఒక్క రోజే రూ.8.9 లక్షల కోట్ల సంపద హుష్

  • 24 శాతం పడిపోయిన ఫేస్ బుక్ షేర్ల విలువ
  • భవిష్యత్ ఆదాయంపై నీలినీడల నేపథ్యంలో షేర్ల అమ్మకాలకు దిగిన మదుపర్లు
  • మార్క్ జుకర్ బర్గ్ కు రూ.లక్ష కోట్ల నష్టం

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా మొబైల్ కంపెనీలకు వినియోగదారుల సమాచారాన్ని అమ్మటంతో పాటు కేంబ్రిడ్జి అనలిటికా ఘటనల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయంపై నీలినీడలు కమ్ముకోవడంతో ఫేస్ బుక్ షేర్లు భారీగా నష్టపోయాయి. బుధవారం మార్కెట్ ప్రారంభం కాగానే మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఫేస్ బుక్ షేర్లు 24 శాతం నష్టపోవడంతో ఏకంగా రూ. 8.92 లక్షల కోట్లను కోల్పోయింది. దీంతోపాటు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు చెందిన రూ. 1.15 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో బుధవారం ఫేస్ బుక్ రెండో త్రైమాసిక ఫలితాలను ఆ సంస్థ సీఎఫ్ వో డేవిడ్ వెహ్నర్ ప్రకటించారు. కంపెనీ ఆదాయం రెండో త్రైమాసికంలో 31 శాతం పెరిగి రూ. 35,003 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా ఉదంతం నేపథ్యంలో భవిష్యత్ లో కంపెనీ ఆదాయం తగ్గే అవకాశముందని వ్యాఖ్యానించారు. దీంతో మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగడంతో ఫేస్ బుక్ షేరు ఏకంగా 24 శాతం నష్టపోయింది. ప్రస్తుతం వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతలపై ప్రధానంగా దృష్టి  సారించామనీ, ఇందుకోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు డేవిడ్ పేర్కొన్నారు.

More Telugu News