Wife: భార్యపై కక్షను 'చిల్లర'గా తీర్చుకున్న భర్త!

  • రూ. 25 వేల భరణం.. అంతా చిల్లరే
  • హరియాణాలో ఓ న్యాయవాది నిర్వాకం
  • ఇది వేధించడమేనని భార్య ఆరోపణ
  • భరణంగా పెద్ద నోట్లు ఇవ్వాలని చట్టంలో లేదన్న భర్త

ఓ విడాకుల కేసులో భర్త రూ. 25 వేల భరణాన్ని చిల్లర రూపంలో భార్యకు అందించడంతో దాన్ని లెక్కించలేక ఏకంగా కోర్టు వాయిదా పడింది. ఈ ఘటన హరియాణా పంజాబ్ ఉమ్మడి రాజధాని చండీగఢ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పంజాబ్-హరియాణా హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది, అతని భార్య 2015లో ఓ న్యాయస్థానంలో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో భార్యకు నెలకు రూ. 25,000 భరణాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ తన దగ్గర అంత నగదు లేదని లాయర్ తేల్చిచెప్పడంతో భార్య హైకోర్టును ఆశ్రయించింది. గత రెండు నెలలుగా ఇవ్వని రూ. 50 వేల భరణాన్ని మహిళకు వెంటనే ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.

చివరికి కోర్టు ఆదేశాలతో సదరు న్యాయవాది ప్రతినిధులు అతని భార్యకు నగదు ఉన్న ఓ బ్యాగ్ ను అందించారు. దాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలోనే తెరిచిన ఆమె విస్తుపోయింది. అందులో రూ. 24,600 విలువైన రూ. 1, రూ. 2 కాయిన్లు ఉండగా, నాలుగు వంద నోట్లు ఉన్నాయి. దీంతో ఈ నగదును లెక్కించేందుకు వీలుగా అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రజనీశ్ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ ఘటనపై సదరు మహిళ స్పందిస్తూ.. తనను వేధించేందుకే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శించింది. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడింది. కాగా, భరణం కచ్చితంగా రూ. 100, రూ. 500, రూ. 2 వేల నోట్లతోనే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని సదరు న్యాయవాది మీడియాకు తెలిపారు.

More Telugu News