Andhra Pradesh: పెట్రోలు బంకుల ముందు 'నో స్టాక్' బోర్డులు... పెట్రోలు కోసం భారీ క్యూలైన్లు!

  • పెట్రోలు వినియోగదారులపై లారీల సమ్మె ప్రభావం
  • సింగిల్ పర్మిట్ విధానాన్ని డిమాండ్ చేస్తున్న లారీల యజమానులు
  • పలు బంకుల వద్ద పెరిగిన రద్దీ

లారీల సమ్మె ప్రభావం పెట్రోలు వినియోగదారులపై పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వరుసగా ఆరో రోజు లారీల యాజమాన్య సంఘాలు సమ్మె చేస్తుండటం వల్ల, రెండు రాష్ట్రాల్లో 4,500 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడంతో పెట్రోలుకు కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు పెట్రోలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండగా, రేపటితో బంకులు పూర్తిగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలు నిల్వలున్న బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే లారీల సమ్మెతో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడగా, పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాకూ అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి. సమ్మెలో మొత్తం 90 లక్షల లారీలు పాల్గొంటున్నాయని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. లారీల యజమానులవి న్యాయమైన డిమాండ్లేనని, సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News