jayalalitha: జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు: హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

  • తాను జయ కుమార్తెనంటూ కోర్టుకెక్కిన అమృత
  • కాదంటూ వీడియోలు సమర్పించిన ప్రభుత్వం
  • అవసరం అనుకుంటే డీఎన్ఏ పరీక్ష చేయాలన్న ఏజీ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను కోర్టుకు సమర్పించింది. తాను జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత కేసు వేసి కలకలం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.

జయలలిత ఆస్తులపై కన్నేసిన అమృత వాటిని సొంతం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. ఒకవేళ అమృత.. జయలలిత కుమార్తే అయితే, తన జీవితకాలంలో ఆమెతో కలిసి ఒక్క ఫొటో కూడా ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు.

జయలలితకు తాను 1980 ఆగస్టులో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొనడంతో, అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను కోర్టుకు సమర్పించారు. అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపారు.

అవసరం అనుకుంటే జయలలిత బంధువుల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News