Nizamabad District: నిజామాబాద్‌లో పురివిప్పిన గ్యాంగ్ వార్.. సంచలనం అవుతున్న జంట హత్యలు!

  • హడలిపోతున్న జనాలు
  • కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టుల్లా నిందితులు
  • 20 ఏళ్లు కూడా లేకుండానే ముఠాలు

నిజామాబాద్ రైల్వే స్టేషన్ మైదానంలో ఈనెల 21న జరిగిన రెండు జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. పవన్‌కల్యాణ్ యాదవ్, నర్సింగ్ యాదవ్ అనే అన్నదమ్ములు రైల్వే స్టేషన్ మైదానంలో దారుణ హత్యకు గురయ్యారు. సాయంత్రం ఐదారు గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగా ప్రత్యర్థులు వారిని దారుణంగా హత్య చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. పవన్ కల్యాణ్ యాదవ్ ఐటీఐ పూర్తి చేశాడు. నర్సింగ్ యాదవ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వీరిని హత్య చేసిన సాయిప్రసాద్ అలియాస్ తల్వార్ సాయి అనే యువకుడు కూడా వారి వయసు వాడే కావడం గమనార్హం. తన అనుచరులతో కలిసి అన్నదమ్ములపై దాడిచేసిన సాయి కత్తులతో వారి గొంతు కోశాడు. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుల్లా వారు వ్యవహరించడాన్ని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. పవన్‌ను 14సార్లు కసితీరా పొడిచిన సాయి, నర్సింగ్ గొంతులో కత్తి దించేశాడు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన సంచలనమైంది.

నిజామాబాద్‌కే చెందిన ఓ యువకుడు గ్యాంగ్ నడుపుతుండగా, తల్వార్ సాయి అతడికి ప్రధాన అనుచరుడు. ఈ ముఠాతో విభేదాలు ఉన్న ఆదర్శనగర్‌కు చెందిన పవన్ కల్యాణ్ యాదవ్ మరికొందరితో కలిసి మరో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు ముఠాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ నెల 21న రైల్వే స్టేషన్ సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడిన సాయి వర్గీయులు అక్కడు మందు తాగారు. అనంతరం పవన్ వర్గానికి ఫోన్ చేసి దమ్ముంటే అక్కడికి రావాలని పిలిచారు. దీంతో అక్కడికి చేరుకున్న పవన్‌పై దాడి చేశారు. అతడి సోద‌రుడు నర్సింగ్‌కు ఫోన్ చేసి మీ అన్నను కొడుతున్నామని, దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన నర్సింగ్‌పైనా దాడి చేశారు. పవన్ అక్కడికక్కడే చనిపోగా, నర్సింగ్ చికిత్స పొందుతూ మరణించాడు.

ఘటన జరిగిన తర్వాత నిందితుడు తల్వార్ సాయి పోలీసులకు లొంగిపోగా, అతడి అనుచరులు మహేందర్ యాదవ్, సంజయ్ అలియాస్ నానిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిండా ఇరవయ్యేళ్లు కూడా లేని యువకులు కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరించి, నడిరోడ్డుపైనే ప్రత్యర్థులను మట్టుబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిజామాబాద్ రెండేళ్ల క్రితమే కమిషనరేట్‌గా మారినా నేరాలకు మాత్రం చెక్ పడడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

More Telugu News