Hyderabad: తమ్ముడి పెళ్లిని ఏడాదిపాటు ఆపేందుకు అన్న కుట్ర.. నాయనమ్మను హత్య చేసిన వైనం!

  • ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందని ఆందోళన
  • నానమ్మను హత్య చేసి పరారీ
  • విచారణలో విస్తుపోయే విషయం వెల్లడి

తమ్ముడికి పెళ్లి జరిగితే తానెక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందోనని భయపడిన అన్న ఆ పెళ్లి అపేందుకు చేసిన కుట్ర బయటపడి సంచలనం సృష్టించింది. మేడ్చల్ జిల్లా కీసరలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు నివ్వెరపోయే విషయాన్ని వెల్లడించారు. తమ్ముడి పెళ్లిని ఏడాది ఆపడం కోసం సొంత అన్నయ్యే ఆమెను హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..కీసరకు చెందిన పురాన పెద్దమ్మ (80)కి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మ చిన్న కుమారుడు లక్ష్మయ్య స్థానిక నందినీ నగర్‌లో నివసిస్తున్నాడు. లక్ష్మయ్యకు ముగ్గురు కుమారులు కాగా, శ్రీకాంత్, శ్రీహరికి వివాహాలు అయ్యాయి. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. చిన్న కుమారుడు శ్రీధర్ కోసం సంబంధాలు చూస్తున్నారు.

ఓ కంపెనీలో పనిచేస్తున్న పెద్ద కుమారుడు శ్రీకాంత్ (28) మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉండడంతో తమ్ముడికి వివాహం అయితే తాను ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందని శ్రీకాంత్ భయపడ్డాడు. ఎలాగైనా తమ్ముడి పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాడు.

నానమ్మను చంపేస్తే పెళ్లి ఏడాదిపాటు ఆగిపోతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా శనివారం నానమ్మ ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లాడు. రాకరాక వచ్చిన మనవడిని భోజనం చేయమంది. తాను చేసే వచ్చానని చెప్పడంతో ఆమె భోజనం చేసి పడుకుంది. అందుకోసమే ఎదురుచూస్తున్న శ్రీకాంత్ నానమ్మ ముఖంపై దిండు అదిమి పెట్టాడు. దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుని ఆమె ప్రాణాలు విడిచింది. అనంతరం ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు, మెడలోని గొలుసు సహా ఇతర ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయాడు.

పెద్దమ్మ హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు శ్రీకాంత్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. పెళ్లి ఆపేందుకు తానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించాడు. కాగా, శ్రీకాంత్‌ గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News