Orange Travels: హైదరాబాద్ నుంచి నరసాపురం వెళుతూ... పంట కాలువలో పడిన ఆరంజ్ ట్రావెల్స్ బస్సు!

  • అదుపుతప్పిన 'ఏపీ 16 టీజే 4532' నంబరుగల బస్సు
  • బస్సులో 40 మంది ప్రయాణికులు
  • ఐదుగురికి గాయాలు
  • పరారైన బస్సు సిబ్బంది
గత రాత్రి హైదరాబాద్ నుంచి నరసాపురం బయలుదేరిన ఆరంజ్ ట్రావెల్స్ బస్సు, కృష్ణా జిల్లా పెద పారుపూడి మండలం, వానపాముల గ్రామం సమీపంలో పంట కాలువలోకి బోల్తా పడింది. 'ఏపీ 16 టీజే 4532' నంబరుగల బస్సు 40 మంది ప్రయాణికులతో వెళుతూ ఈ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తే బస్సు అదుపు తప్పడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, చికిత్స కోసం వారిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

బస్సు బోల్తా పడిన సమయంలో తామంతా నిద్రలో ఉన్నామని, పెద్ద కుదుపు మాత్రమే తెలిసిందని, ఆపై అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చామని, తమ బ్యాగులు పంట కాలువలో కొట్టుకుపోయాయని ప్రయాణికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బస్సు సిబ్బంది పరారయ్యారని తెలిపారు. బస్సు ప్రమాదానికి గురి కాగానే, అదే దారిలో వస్తున్న ఇతర వాహనాల ప్రయాణికులు సహాయక చర్యలు ప్రారంభించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
Orange Travels
Bus Accident
Krishna District

More Telugu News