Telugudesam: కేంద్రమంత్రులు మాకు చందమామ కథలు చెబుతున్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • విశాఖలో కావలసినంత భూమి ఉంది
  • రైల్వోజోన్ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందేంటి?
  • విభజన చట్టం అమలు చేయాలి

ఏపీకి కేంద్రమంత్రులు ఎవరొచ్చినా తమకు చందమామ కథలు చెబుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విరుచుకుపడ్డారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో కావలసినంత భూమి, పోర్టు, పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా చందమామ కథలు చెబుతున్నారని విమర్శించారు.

 విభజనతో ఏపీకి అన్యాయం జరుగుతుందని అప్పటి ప్రధాని ప్రత్యేకహోదా ప్రకటించారని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు నాడు మాట్లాడిన విషయాలను ఆయన ప్రస్తావించారు. విభజన చట్టాన్ని అదే స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని డిమాండ్ చేశారు. చాలాసార్లు ఢిల్లీకి వచ్చిన మా సీఎం, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గురించి అడిగితే వేరే విషయాలు మాట్లాడుతున్నారని, అసలు.. విశాఖలో రైల్వోజోన్ ఏర్పాటు చేయడానికి ఉన్న ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు.

విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదని, అయితే సభ సాక్షిగా బీజేపీ ఎంపీ హరిబాబు అసత్యాలు ప్రచారం చేశారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. టీడీపీకి 15 మంది ఎంపీలున్నారని, తమను తక్కువగా తీసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.  ప్రజాస్వామ్య ఆలయం పార్లమెంట్ అని, తమకు అన్యాయం జరిగింది ఈ సభలోనే కనుక, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అడుగుతామని ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ విధానం ఏమిటో ఈరోజు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News