Rahul Gandhi: మోదీపై విరుచుకుపడ్డ రాహుల్.. అమిత్ షా కుమారుడి పేరు ప్రస్తావన!

  • పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకు రాఫెల్ డీల్
  • బడా కంపెనీలతో మోదీ కుమ్మక్కయ్యారు
  • మోదీ పాలనలో ప్రజలు భయంతో బతుకుతున్నారు
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగిస్తూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కొన్ని పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకే రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. రూ. 45 వేల కోట్ల మేరకు ఆ సంస్థకు కట్టబెట్టారని విమర్శించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని అన్నారు. తన మాటలకు ప్రధాని నవ్వుతున్నారని... కానీ, ఆయన మనసులో మాత్రం ఆందోళన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. తాను ప్రధానిని కాదు, దేశానికి కాపలాదారుడినని మోదీ చెప్పారని... కానీ ఆయన పాలనలో దేశ ప్రజలు భయంతో బతుకుతున్నారని దుయ్యబట్టారు.

తన ప్రసంగం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జేషా పేరును రాహుల్ తెరపైకి తెచ్చారు. దీంతో, బీజేపీ నేతలు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ప్రధాని మోదీ మార్కెటింగ్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది ఎవరని రాహుల్ ప్రశ్నించారు. బడా కంపెనీలతో మోదీ కుమ్మక్కయ్యారనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా, పారిశ్రామికవేత్తలకు మోదీ మేలు చేస్తున్నారని విమర్శించారు.
Rahul Gandhi
Narendra Modi
no confidence motion

More Telugu News