sarve satyanarayana: చంద్రబాబు గుడ్ అడ్మినిస్ట్రేటర్: కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే కితాబు

  • తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
  • వచ్చే ఎన్నికల్లో అల్లుడిని కూడా ఎంపీ చేస్తారేమో
  • కమిషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప పాలనాదక్షుడని టీకాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కితాబిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసేందుకు టీడీపీ ముందుకు వస్తే, తాము స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. బంగారు తెలంగాణే తన లక్ష్యమని చెప్పిన కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు స్తంభాలాట నడిచిందని... ప్రస్తుతం ఫైవ్ మెన్ ఆర్మీ పాలన కొనసాగుతోందని సర్వే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అల్లుడికి కూడా కేసీఆర్ ఎంపీ పదవి ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసమేనని ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్ లో దళితులకు, మహిళలకు చోటు దక్కలేదని విమర్శించారు. దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ కు చేసిందేమీ లేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. జనం జేబులనే కాకుండా, బ్యాంకులను కూడా ఖాళీ చేశారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. 

More Telugu News