Rape: బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్షే... క్యాబినెట్ ఆమోదం... అత్యాచారాలకు ప్రతిపాదించిన కొత్త శిక్షల వివరాలు!

  • రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు
  • చట్టాన్ని మార్చే ప్రతిపాదనలతో ముసాయిదా
  • ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రిమండలి
  • ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదానికి

దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతుండటంతో కఠిన చట్టాలు తేవాలన్న ఉద్దేశంతో సమావేశమైన కేంద్ర క్యాబినెట్, 12 ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదనలతో తయారైన ముసాయిదా బిల్లుకు ఆమోదం పలికింది. దీంతో పాటు బిల్లులో పలు కీలక మార్పులకూ కేంద్ర మంత్రిమండలి ఓకే చెప్పింది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కాగా, ఇప్పటికే దీనిపై ఆర్డినెన్స్ వున్న సంగతి విదితమే.

ఇక ఈ బిల్లులోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులపై అత్యాచారం చేస్తే, కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష నుంచి జీవితఖైదు లేదా మరణదండన విధించవచ్చు. అదే సామూహిక అత్యాచారమైతే జీవితఖైదు లేదా మరణదండన విధించవచ్చు.16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికైతే 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష... దీన్ని జీవితఖైదుగానూ మార్చే అవకాశం.

ఇక మహిళపై రేప్ చేస్తే, కనీసం పదేళ్ల జైలుశిక్ష నుంచి జీవితఖైదు వరకూ విధించవచ్చు. అత్యాచార కేసులను 2 నెలల్లో విచారించాలి. అపీళ్లు వస్తే ఆరు నెలల్లో విచారణ జరపాలి. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం, సామూహిక అత్యాచారం నిందితులకు ముందస్తు బెయిల్ ఉండదు. వారికి బెయిల్ ఇవ్వాలని భావిస్తే, కనీసం 15 రోజుల ముందు బాధితురాలి తరఫు న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానాలు కోరుతూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.

More Telugu News