Telangana: పసుపు, మిర్చి పంటల సమగ్రాభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి: తెలంగాణ సీఎస్

  • పసుపు, మిర్చి పండించే ప్రాంతాలపై దృష్టి సారించాలి
  • వ్యవసాయ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
  • పసుపు, మిర్చి రైతులకు భూసార కార్డులివ్వాలి

తెలంగాణ రాష్ట్రంలో పసుపు, మిర్చి పంటల సమగ్ర అభివృద్ధిపై రైతులు, శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలతో చర్చించి 15 రోజులలోగా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. సచివాలయంలో స్పైస్ డెవలప్ మెంట్ ఏజెన్సీ సమావేశం ఈరోజు నిర్వహించారు. జోషి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి, ఉద్యానవన శాఖ కమీషనర్ వెంకటరాం రెడ్డి, స్పైసెస్ బోర్డు డి.డి. జి.లింగప్ప, కేంద్ర ప్రభుత్వ అధికారి సత్యం శద్రా, రైతులు పొలం రమణారెడ్డి, జి.సుధాకర్, యం జితేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, రాష్ట్రంలో పసుపుకు సంబంధించి 70 వేల మంది రైతులు లక్షా 10 వేల హెక్టార్లలో, మిర్చికి సంబంధించి లక్షా 40 వేల మంది రైతులు సేద్యం చేస్తున్నారని, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాది తదితర జిల్లాలో పండిస్తున్నారని తెలిపారు. ఈ పంటలు పండించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులకు మేలు చేసేలా వ్యవసాయ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

పసుపు, మిర్చి పండించే రైతులకు భూసార కార్డులను రూపొందించి ఎప్పటికప్పుడు సూచించిన మేరకు ఎరువులు, పెస్టిసైడ్స్ రైతులు వినియోగించేలా చూడాలని సూచించారు.100 శాతం డ్రిప్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని, రైతులను వివిధ చీడల బారి నుండి రక్షించేలా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని అన్నారు. వచ్చే మూడేళ్లు, ఐదేళ్లకు సంబంధించి ఈ పంటల అభివృద్ధి కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని, ఇంటిగ్రేటేడ్ పెస్ట్ మేనేజ్ మెంట్, మార్కెట్ లింకేజ్, బయ్యర్ సెల్లర్స్ మీట్, ధరల స్ధీరీకరణ బాయిలర్స్, పాలీషర్స్ సరఫరా, వివిధ రకాల విత్తనాల అందుబాటు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా రైతులకు మేలు చేసేలా పరిశోధనలు, సలహాలు అందించాలని జోషి కోరారు. మిర్చి, పసుపు పంటల ఉత్పత్తికి వాల్యు ఎడిషన్ జరిగేలా చూడాలని, స్పైస్ డెవలప్ మెంట్ బోర్డు, హార్టికల్చర్ డిపార్టుమెంట్, ఎగుమతి దారులు సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, రైతులకు ఆధునాతన పద్ధతులు అందుబాటులోకి తెచ్చి ఉత్పాదకత పెరిగేలా చూడాలని సూచించారు.

వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ, తెలంగాణలో పసుపు, మిర్చితో పాటు అల్లం, వెల్లుల్లి తదితర 8 రకాల స్పైసెస్ లను పండిస్తున్నారని, నిజామాబాద్ జిల్లా పడగల్ లో 30 కోట్లతో స్పైస్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని సీఎస్ కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు, మిర్చి పంటల సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

More Telugu News