Thailand: బ్రేవ్ బాయ్స్... ఒకరోజు ముందుగానే థాయ్ బాలల డిశ్చార్జ్!

  • గుహలో చిక్కుకుపోయిన థాయ్ ఫుట్ బాల్ టీమ్
  • బయటకు వచ్చి ఆసుపత్రిలో వేగంగా రికవరీ
  • నేడు మీడియాతో మాట్లాడనున్న బాలలు

థాయ్ లాండ్ లోని గుహలో చిక్కుకుపోయి, రెండు వారాలకు పైగా గడిపి, రెస్కూ టీమ్, డైవర్ల సాయంతో బయటకు వచ్చిన 12 మంది 'వైల్డ్ బోర్స్' ఫుట్ బాల్ టీమ్ చిన్నారులు, వారి కోచ్ ఈ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వాస్తవానికి వారిని రేపు డిశ్చార్జ్ చేయాలని భావించినా, వారు త్వరగా కోలుకున్న నేపథ్యంలో వైద్యులు ఒకరోజు ముందుగానే డిశ్చార్జ్ చేశారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ సాయంత్రం వారు మీడియాతో మాట్లాడతారని, వారి అనుభవాలను గురించి తెలుసుకోవచ్చని, ఆపై వారు సాధారణ జీవితంలోకి వెళతారని థాయ్ ప్రభుత్వ ముఖ్య ప్రతినిధి సున్ సెర్మ్ వెల్లడించారు. వారు ఇళ్లకు వెళ్లిన తరువాత మీడియా వారిని వెంబడించ వద్దని సూచించారు. వీరంతా 11 నుంచి 16 సంవత్సరాల చిన్నారులు కాబట్టి, కనీసం నెల రోజుల పాటు ఎలాంటి మీడియాకూ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.

థాయ్ గుహలో వారు కలుషిత నీటిని తాగినందున వారికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని, రక్తంలో మలినాలున్నాయేమో చూస్తామని తెలిపారు. 

More Telugu News