నటుడు ఉత్తేజ్ వస్త్ర దుకాణంలో చోరీ చేసిన మహిళ అరెస్ట్

17-07-2018 Tue 07:45
  • ఎల్లారెడ్డిగూడలో ఉత్తేజ్ వస్త్ర దుకాణం
  • చీర కొనుగోలుకు వచ్చి చోరీ
  • రెండు నెలల తర్వాత పట్టుబడిన నిందితురాలు
సినీ నటుడు ఉత్తేజ్ వస్త్ర దుకాణంలో చీరలు చోరీ చేసిన మహిళను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత ఆమె పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ సమీపంలోని తాడేపల్లికి చెందిన కనకదుర్గమ్మ (50) మేలో కూకట్‌పల్లిలో ఉండే తన బంధువుల ఇంటికి మరో ఇద్దరితో కలిసి వచ్చింది. ముగ్గురూ కలిసి మే 17న ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఉత్తేజ్ వస్త్ర దుకాణానికి వచ్చారు.

చీరలు కొంటున్నట్టు నటిస్తూ ఉప్పాడ, బనారస్‌ పట్టుచీరలను కనకదుర్గ కాజేసి వెళ్లిపోయింది. వారు వెళ్లిన తర్వాత చూస్తే 20 చీరలు తక్కువ రావడంతో దుకాణం నిర్వాహకులు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కనకదుర్గమ్మ విజయవాడకు చెందిన పాత నేరస్తురాలిగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో విజయవాడ వెళ్లిన ఎస్సార్ నగర్ పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు.